రైళ్లలో ప్రయాణించే వారికి అనేక సౌకర్యాలను అందిస్తున్న రైల్వే, అందులో ఏసీ బోగీల్లో టికెట్ రిజర్వ్ చేసిన ప్రయాణికులకు దుప్పట్లను కూడా అందిస్తుంది. కానీ ఈ దుప్పట్ల శుభ్రత పై ప్రయాణికులలో అనేక సందేహాలు ఉండటంతో, తాజాగా పార్లమెంట్‌లో ఓ ఎంపీ రైల్వే మంత్రిని ఈ విషయంలో ప్రశ్నించారు. “నెలకు ఎన్ని సార్లు ఈ దుప్పట్లను శుభ్రం చేస్తారనేది” ప్రశ్న, దానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ, భారతీయ రైల్వే ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్లను కనీసం నెలకు ఒకసారి శుభ్రం చేస్తుందని తెలిపారు. అలాగే, బెడ్‌రోల్ కిట్‌లో మెత్తని కవర్‌గా ఉపయోగించే అదనపు షీట్ కూడా అందిస్తామని ఆయన వెల్లడించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రైళ్లలో పరిశుభ్రత ప్రమాణాలు పాటించడానికి అదనంగా వసూలు చేస్తున్న రైల్వే, ప్రయాణికులు వాడిన దుప్పట్లను నెలకు ఒకసారి మాత్రమే ఉతుకుతుందా? అని కాంగ్రెస్ ఎంపీ కుల్దీప్ ఇండోరా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరణ ఇచ్చారు.
భారతీయ రైల్వేలో ప్రయాణీకులకు అందించే దుప్పట్లు తేలికగా, సులభంగా శుభ్రం చేయగలవని ఆయన తెలిపారు. ఆయన మాటల్లో, “ప్రయాణీకుల సౌకర్యం మరియు భద్రతను పరిగణనలోకి తీసుకుని, రైల్వే మసూచిగా అనేక చర్యలు తీసుకుంటోంది” అని పేర్కొన్నారు.
రైల్వే ప్రయాణీకుల సౌకర్యం, పరిశుభ్రత కోసం తీసుకుంటున్న చర్యలపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా మరిన్ని వివరాలు వెల్లడించారు. నాణ్యతను నిర్ధారించడానికి, రైల్వే BIS ధ్రువీకరణతో కూడిన కొత్త లెనిన్ సెట్ల సేకరణ చేస్తుందని, అలాగే మెకనైజ్డ్ లాండ్రీలు, ప్రామాణిక యంత్రాలు, వాషింగ్ కోసం రసాయనాల వినియోగం వంటి చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు. దుప్పట్ల నాణ్యతను కూడా తనిఖీ చేయడానికి వైటో మీటర్ ఉపయోగిస్తామని ఆయన చెప్పారు.
అంతేకాక, ప్రయాణికుల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు, రైల్‌మదాద్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను పర్యవేక్షించడానికి, జోనల్ హెడ్‌క్వార్టర్స్, డివిజనల్ స్థాయిలలో ‘వార్ రూమ్’లను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఈ విధంగా ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా తక్షణమే వాటిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ అంశం ఇటీవల పార్లమెంటులో కూడా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు దీనికి రైల్వే మంత్రి వివరంగా సమాధానం ఇవ్వడం కూడా నెటిజన్లను ఆకర్షించింది. మంత్రి వివరణపై పలు రకాలుగా స్పందిస్తున్నారు. బెడ్ షీట్లను నెలకు ఒక్కసారైనా ఉతుకుతున్నారని కొందరు అంటే.. నెలకు రెండు సార్లు వాష్ చేయాలని మరికొందరు కోరుతున్నారు. ఇంట్లో మాదిరిగా నెలకు ఓసారి ఉతికితే చాలని ఇంకొందరు కామెంట్లు చేయడం కొసమెరుపు. మరి కొంత మంది మాత్రం బెడ్‌షీట్‌లు ఉతికినట్టే ఉండటం లేదని విమర్శిస్తున్నారు.