అకాల వర్షాలు (Untimely Rain) రైతులను ముంచెత్తాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో పలుచోట్ల రైతులు (Farmers) తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో కామారెడ్డిలో 20వేలు, నిజామాబాద్లో 6వేలు, సిరిసిల్లలో 500 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలతో పాటు గోధుమ, ఉల్లి, బొప్పాయి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. తమను ఆదుకోవాలని రైతన్నలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఆదివారం రాత్రి దాదాపు రెండు గంటల పాటు ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 3,076 మంది రైతులకు చెందిన 6,058 ఎకరాలు దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 20,071 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లోని 130 గ్రామాల్లో 14,553 మంది రైతులకు చెందిన పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న పంటలతో పాటు కొత్తిమీర, గోధుమలు, ఉల్లి, బొప్పాయి, మామిడి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి.
ఇదిలా ఉంటే.. సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున కురిసిన ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కారణంగా అపారమైన పంట నష్టం వాటిల్లింది. లేత దశలో కాయలు వచ్చిన మామిడి పంటకు భారీ నష్టం నమోదైంది. సంగారెడ్డి జిల్లాలో దాదాపు 16 వేల ఎకరాల్లో రైతులు మామిడి సాగు చేశారు. జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్ తదితర ప్రాంతాల్లోని పలు పండ్లతోటలు భారీగా నష్టపోయాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తున్నందున, అకాల వర్షాలు తమకు తీవ్ర నష్టం కలిగిస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
జహీరాబాద్ పట్టణం చుట్టుపక్కల గ్రామాల్లో 38 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్న రైతు ఎండి హరీఫ్ మాట్లాడుతూ తన తోటల్లో చాలా వరకు కాయలు లేత దశలో ఉన్నందున పంటలు పడిపోయాయని తెలిపారు. పంట నష్టం గణన చేపట్టి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మరో రైతు సుభాష్‌రెడ్డి కోరారు. వర్షం కారణంగా ఇతర పంటలకు కూడా నష్టం వాటిల్లింది. జిల్లాలో ఆదివారం సాయంత్రం కూడా ఈదురు గాలులు వీచాయి.
వ్యవసాయ విస్తరణాధికారి (జహీరాబాద్) ప్రదీప్ కుమార్ జహీరాబాద్ పరిధిలోని పలు పొలాలను సందర్శించి పంట నష్టాన్ని పరిశీలించారు.
Read Also : TSRTC: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్షల కోసం ప్రత్యేక బస్సులు