Site icon HashtagU Telugu

National Turmeric Board : పసుపు బోర్డు ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్

Union Minister Goyal launched the Yellow Board

Union Minister Goyal launched the Yellow Board

National Turmeric Board : నిజామాబాద్‌ పుసుపు రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. సంక్రాంతి పర్వదినాన జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైంది. ఈ మేరకు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వర్చువల్‌గా పసుపు బోర్డును ప్రారంభించారు. జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023, అక్టోబర్ 1వ తేదీన మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోడీ ప్రకటించారు. దీని తర్వాత అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, బోర్డు కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేస్తామనేది అందులో ప్రస్తావించలేదు. తాజాగా, నిజామాబాద్‌లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం నిజామాబాద్‌లో ఉన్న రీజనల్ స్పైస్ బోర్డు కార్యాలయం నుంచే కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.

ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి గోయల్.. పల్లె గంగారెడ్డిపై బృహత్తర బాధ్యతను పెట్టామని అన్నారు. పసుపు బోర్డును సరైన దిశలో నడిపించాలన్నారు. సంక్రాంతి పర్వదినం రోజున పసపు రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ పసుపు బోర్డును గిఫ్ట్‌గా ఇచ్చారని వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రధానికి తాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని వ్యాఖ్యనించారు. భారత్‌కు ప్రపంచంలో గొప్ప పేరు ఉందని, నాణ్యమైన పంట పండించేలా రైతులను ప్రోత్సహిస్తామన్నారు. ప్రధాని మోడీ ఆశీర్వాదంతో పసుపు బోర్డు ఏర్పాటు చేశామని, ఆయన ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని తెలిపారు.

నిజామాబాద్ పసుపు రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ సంక్రాంతి కానుక ఇచ్చారని ఎంపీ అర్వింద్ అన్నారు. బోర్డు ఏర్పాటుతో అన్నదాతలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. పసుపు ప్రాసెసింగ్, మార్కెటింగ్ విషయంలో బోర్డుతో ఎంతో ఉపయోగం ఉటుందని అన్నారు. తెలంగాణతో సహా మొత్తం 20 రాష్ట్రాల్లో మొత్తం 30 రకాల పసుపును పండిస్తున్నాయని చెప్పారు. పసుపు బోర్డు కోసం 40 ఏళ్లుగా రైతులు పోరాటం చేశారని గుర్తు చేశారు. నేడు ఆ రైతుల జీవితాల్లో ప్రధాని మోడీ వెలుగులు నింపారని అన్నారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పాల్గొన్నారు. ఇక ఆర్మూర్ జిల్లాకు చెందిన బీజేపీ నేత, రైతు పల్లె గంగారెడ్డిని పసుపు బోర్డు చైర్మన్‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈరోజు ఆయన బాధ్యతలను స్వీకరించారు. పండుగ రోజు పసుపు బోర్డు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. గతంలో చాలా మంది పసుపు బోర్డు గురించి మాట్లాడి సాధించలేదన్నారు. తెలంగాణ ప్రజల తరపున కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Read Also: VVS Laxman: టీమిండియా టెస్టు కోచ్‌గా వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌.. బీసీసీఐకి మాజీ క్రికెట‌ర్ సూచ‌న‌!