తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏపీకి చెందిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటికి సంబంధించిన వివరాలను ఉండవల్లి సోమవారం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. కేసీఆర్ తాను స్వయంగా ఫోన్ చేసి పిలిస్తేనే తాను భేటీ అయ్యాయని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో ఎలాంటి పార్టీ గురించి చర్చించలేదని స్పష్టం చేశారు ఉండవల్లి.
కేసీఆర్ ఆహ్వానం మేరకు తాను ప్రగతి భవన్ వెళ్లినట్లు స్పష్టం చేశారు ఉండవల్లి. తనను మంత్రి హరీశ్ రావు కేసీఆర్ వద్దకు తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆ తర్వాత కేసీఆర్ తన భేటీలో హరీశ్ రావుతోపాటుగా మరో మంత్రి ఓ ఎంపీ పాల్గొన్నట్లు చెప్పారు. తాము చర్చించుకున్నంత సేపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా అక్కడే ఉన్నట్లు చెప్పిన ఉండవల్లి..ప్రశాంత్ కిషోర్ చర్చలో పాలుపంచుకోలేదని తాము మాట్లాడుకుంటుంటే…ఆయన విన్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీల కంటే బీజేపీనే బలమైన పార్టీ అని ఉండవల్లి పేర్కొన్నారు. ఏపీలో 25మంది ఎంపీలు బీజేపీ ఎంపీలుగానే భావించాలన్నారు.
ప్రధానంగా రాజకీయాలపై చర్చ జరిగిందన్న ఉండవల్లి…బీఆరెస్ గురించి మాత్రం ప్రస్తావన రాలేదని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలనపైనే చర్చ జరిగినట్లు చెప్పారు. దేశంలోమోదీ పాలనకు వ్యతిరేకించే వారిలో కేసీఆర్ బలమైన నేతగా ఉన్నారని ఉండవల్లి స్ఫస్టం చేశారు. తాను బీజేపీకి వ్యతిరేకం కాదని చెప్పిన ఉండవల్లి…కేవలం ఆ పార్టీ విధానాలనే తాను వ్యతిరేకిస్తానని చెప్పారు. బీజేపీపై కేసీఆర్ తోపాటు తనదీ కూడా ఒకటే అభిప్రాయమని వెల్లడించారు.
కేసీఆర్ తో కలిసి తాను భోజనం చేశామన్నారు. తనను కేసీఆర్ ఆహ్వానిస్తే…సీఎంఓ నుంచి తాను వెజ్ తింటానా…నాన్ వెజ్ తింటానా అంటూ ఆరా తీసినట్లు చెప్పారు. తనతోపాటు కేసీఆర్ కూడా వెజిటేరియన్ తిన్నారని చెప్పారు. పీకే కూడా తమతో కలిసి భోజనం చేశారని ఉండవల్లి చెప్పారు.