Site icon HashtagU Telugu

Umran Malik: వారెవ్వా ఉమ్రాన్.. చివరి ఓవర్‌ మెయిడెన్, 3 వికెట్లు

Umran Malik

Umran Malik

క్రికెట్‌ ఏ ఫార్మేట్‌లోనైనా మెయిడెన్ ఓవర్ అంటే బౌలర్ ప్రతిభకు తార్కాణమే.. మరీ ముఖ్యంగా బ్యాటర్స్ గేమ్‌గా ఉండే టీ ట్వంటీ ఫార్మేట్‌లో మెయిడెన్ ఓవర్ చేయడం… అందులోనూ చివరి ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టడం అసాధరణమైన ప్రదర్శనగా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి అరుదైన ప్రదర్శనకు పంజాబ్ కింగ్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ వేదికగా నిలిచింది. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ యువ బౌల‌ర్ ఉమ్రాన్ మాలిక్ ఈ రేర్ ఫీట్ సాధించాడు.

తన ఫాస్టెస్ట్ బౌలింగ్‌తో అదరగొడుతున్న ఈ స్పీడ్ గ‌న్ పంజాబ్ చివరి ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయాడు. ఒక్క ప‌రుగు కూడా ఇవ్వ‌కుండా ఆ ఓవ‌ర్‌ను మెయిడెన్ చేయ‌డంతోపాటు ఏకంగా 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఒక ర‌నౌట్ కూడా రావడంతో ఆ ఓవ‌ర్లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు 4 వికెట్లు దక్కాయి. 19 ఓవ‌ర్లు ముగిసే స‌మయానికి పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల న‌ష్టానికి 151 ప‌రుగులు చేసింది. క్రీజులో ఓడియ‌న్ స్మిత్, ర‌బాడ ఉన్నారు. చివరి ఓవర్ కావడంతో కనీసం 10 పరుగులైనా సాధిస్తుందని అంతా అంచనా వేశారు. అయితే ఉమ్రాన్ మాలిక్ పంజాబ్‌కు అస్సలు అవకాశం ఇవ్వలేదు. కవీసం సింగిల్ కూడా తీసే అవకాశం ఇవ్వకుండా ముగ్గురు బ్యాటర్లను పెవిలియన్‌కు పంపాడు. తొలి బంతికి పరుగులేమి ఇవ్వని ఉమ్రాన్ మాలిక్‌ రెండో బంతికి ఓడియ‌న్ స్మిత్‌ను ఔట్ చేశాడు. మూడో బంతికి కూడా పరుగు ఇవ్వకుండా…నాలుగో బంతికి రాహుల్ చాహ‌ర్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బంతికే వైభ‌వ్ అరోరాను కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. అటు చివ‌రి బంతిని అర్ష్‌దీప్ సింగ్ అడ్డుకోవ‌డంతో ఉమ్రాన్ మాలిక్‌కు హ్యాట్రిక్‌ మిస్స‌యింది.

అయితే స‌చిత్, పూర‌న్ క‌లిసి అర్ష్‌దీప్ సింగ్‌ను ర‌నౌట్ చేశారు. మొత్తానికి ఆ ఓవ‌ర్లో ఒక్క ప‌రుగు కూడా ఇవ్వ‌కుండా ఉమ్రాన్ మాలిక్ మెయిడెన్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 28 ప‌రుగులే ఇచ్చిన ఉమ్రాన్ మాలిక్ 4 వికెట్లు తీశాడు. అలాగే ఉమ్రాన్ మాలిక్‌కు ఐపీఎల్‌లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. కాగా ఈ చివరి ఓవర ప్రదర్శనతో ఉమ్రాన్ మాలిక్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో చివరి ఓవర్‌ను మెయిడెన్ చేసిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. గతంలో ఇర్ఫాన్ ప‌ఠాన్, జ‌య‌దేవ్ ఉన‌ద్క‌త్ ఇలాంటి రికార్డును సాధించారు. 2008లో పంజాబ్ కింగ్స్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన ఇర్ఫాన్ ప‌ఠాన్ ముంబై ఇండియ‌న్స్‌పైనా, 2009లో ముంబై ఇండియ‌న్స్ బౌలర్ ల‌సిత్ మ‌లింగ డెక్క‌న్ చార్జ‌ర్స్‌పైనా చివరి ఓవర్‌ను మెయిడెన్ చేశారు. 2017లో రైజింగ్ పుణే సూప‌ర్ జెయింట్స్ బౌలర్ జ‌య‌దేవ్ ఉన‌ద్క‌త్ హైద‌రాబాద్‌పై ఈ ఫీట్ సాధించగా.. ఇప్పుడు ఉమ్రాన్ మాలిక్ కూడా వారి సరసన చేరాడు.

Pic Courtesy- Twitter