Site icon HashtagU Telugu

Ukraine war: 900 మందిని సామూహిక సమాధి చేసిన రష్యా సైన్యం

Ukrain

Ukrain

“మనిషిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనియేనా?” ఓ సినీ కవి చక్కగా ప్రశ్నించారు. దీన్ని చెవులారా వినాల్సిన బాధ్యత రష్యాపై ఉంది. తనకు ఉన్న బలాన్న .. బలహీనులపై చూపించే దుష్ట సంప్రదాయాన్ని రష్యా ఆపేయాలి. ఉక్రెయిన్‌ లో రష్యా సైన్యం నరమేధానికి పాల్పడుతోంది. దురాక్రమణ కోసం రష్యా చేసిన దురాగతాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ లోని కీవ్ ఒబ్లాస్ట్‌ ప్రావిన్స్ పరిధిలో దాదాపు 900 మంది ప్రజలను చంపేసి.. సామూహికంగా ఒకేచోట రష్యా సైన్యం ఖననం చేసింది. మార్చిలో ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టిన రష్యా సైన్యం.. తమను ప్రతిఘటించిన ప్రజలు, సైనికులను నిర్దాక్షిణ్యంగా చంపేసి సామూహికంగా ఖననం చేసింది. ప్రజా ప్రతిఘటన ఉన్న ప్రాంతాలపై వైమానిక దాడులు చేసి, మిస్సైళ్ళు ప్రయోగించి ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. ఇలా చనిపోయిన దాదాపు 900 మందిని ఒకేచోట పూడ్చి పెట్టింది. ఓ మీడియా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బాధాకర విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు. కీవ్ ఒబ్లాస్‌పై రష్యా మూడుసార్లు మిస్సైల్స్ ప్రయోగించిందని తెలిపారు.

రెండు నెలలు దాటినా..

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై ఇప్పటికే రెండు నెలలు దాటిపోయింది. పలుమార్లు ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు సఫలం కాలేదు. ఫలితంగా రష్యా దాడులకు పాల్పడుతూనే ఉంది. దేశాన్ని రష్యా దురాక్రమణ నుంచి కాపాడుకునేందుకు తుది శ్వాస వరకు పోరాడుతానని జెలెన్‌స్కీ ఇదివరకే పలుమార్లు వెల్లడించారు. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి ఇప్పటికే 54 లక్షల మంది ప్రజలు శరణార్థులుగా ఇతర దేశాలకు వలస వెళ్లారు. అంతర్గతంగా మరో 7.7 మిలియన్ల ప్రజలు చెల్లా చెదురైపోయారు.

Exit mobile version