Site icon HashtagU Telugu

Ukraine Russia War: ఉక్రెయిన్ నాటోలో చేర‌దు.. జెలెన్‌స్కీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Nato Ukrain Zelenskyy

Nato Ukrain Zelenskyy

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్‌కీ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఉక్రెయిన్, ర‌ష్యా యుద్ధం మొద‌లై రెండు వారాలు దాటింది. ఉక్రెయిన్‌లో ర‌ష్యా సైనిక ద‌ళాలు తీవ్ర‌స్థాయిలో బాంబు దాడులు చేస్తూ, అక్క‌డ బీభ‌త్సం సృష్టిస్తూ, దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాలన్నిటిని ధ్వంసం చేస్తున్నాయి. తొలిరోజు నుంచి ఉక్రెయిన్ సైన్యం పోరాడుతున్నా, ర‌ష్యాకు బ‌లం, బల‌గం ముందు నిల‌వ‌లేక‌పోతున్న‌నారు.

మ‌రోవైపు నాటో దేశాల నుంచి స‌హాయం కోర‌గా, డైరెక్ట్‌గా యుద్ధానికి దిగేది లేద‌ని చెప్పి, ఉక్రెయిన్ ఊహించ‌ని విధంగా హ్యాండ్ ఇచ్చాయి. ఇఈ క్ర‌మంలో తనకు నాటోలో చేరాలన్న ఆసక్తి పోయిందనీ ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ అన్నారు. ఇక తాను మోకాళ్లపై కూర్చుని అడుక్కోలేమనీ, ఉక్రెయిన్ ప్రజలు తనను అలా చూడలేరన్నాడు. ఇక నాటో కోసం ఎగబడటం కంటే రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు శాంతియుత చర్చలకు తాను సిద్ధంగా వున్నట్లు జెలెన్‌స్కీ తేల్చి చెప్పారు. దీంతో రష్యా,ఉక్రెయిన్ మ‌ధ్య జ‌రుగుతున్న‌ యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందన్న ఆసక్తి నెలకొంది.

ఇక ఇప్ప‌టికే రష్యన్ అధికారులు ఉక్రెయిన్ ముందు కొన్ని డిమాండ్లు ఉంచిన సంగ‌తి తెలిసిందే. ఉక్రెయిన్ నాటో దేశాల‌తో చేతులు క‌ల‌ప‌కూడ‌దు. యూరోపియన్ యూనియన్ సభ్యత్వాన్ని కొనసాగించకూడదు. క్రిమియాను రష్యన్ భూభాగంగా గుర్తించాలి. లుగాన్స్క్, డొనెట్స్క్ ప్రాంతాలను స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తించాలి. ఈ డిమాండ్లకు ఉక్రెయిన్ అంగీకరిస్తే యుద్ధాన్ని ఆపివేసేందుకు రష్యా సిద్ధంగా వున్నట్లు తెలిపారు. అయితే మ‌రోవైపు అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు విధించిన ఆంక్షలతో రష్యా తీవ్ర ఆగ్రహంతో వుంది. మ‌రి ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధంపై ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది చూడాలి.