Site icon HashtagU Telugu

Indians Trapped: భార‌తీయ విద్యార్థుల‌ను ఉక్రెయిన్ బంధించింది – ర‌ష్యా

Indians

Indians

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన దేశ‌ పౌరులను తరలించడానికి భారతదేశం తన ప్రయత్నాలను వేగవంతం చేసింది. ర‌ష్యా, ఉక్రెయిన్ రెండు దేశాల నుంచి సుర‌క్షిత‌మైన మార్గం కోసం ఇండియా అభ్య‌ర్థన‌ను ప్రారంభించింది. తరలింపు ప్రక్రియ మధ్య, రష్యా, ఉక్రెయిన్ భారతీయ విద్యార్థులను బందీలుగా ఉంచుకున్నాయని ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.
ఉక్రెయిన్ భారతీయ విద్యార్థులను బందీలుగా పట్టుకున్నట్లు రష్యా బుధవారం ప్రకటించింది. ఖార్కివ్ నుండి భారతీయ విద్యార్థులను తరలించడానికి రష్యా ప్రయత్నిస్తుండగా ఉక్రెయిన్ బలగాలు భారతీయులను బందీలుగా పట్టుకున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్ర‌క‌ట‌నలో తెలిపింది.

ఉక్రెయిన్ భూభాగాన్ని విడిచిపెట్టి బెల్గోరోడ్ కు వెళ్లాల‌నుకునే భార‌తీయ విద్యార్థుల‌ను ఖార్కివ్ లో ఉక్రెయిన్ అధికారులు నిర్భందించార‌ని ర‌ష్యా ర‌క్ష‌ణ మంత్రిత్వ‌ శాఖ అధికారిక ప్రతినిధి, మేజర్ జనరల్ ఇగోర్ కోనాషెంకోవ్ తెలిపారు. భారత పౌరులను సురక్షితంగా తరలించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడానికి సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయ‌న్నారు. భారతదేశం ప్రతిపాదించినట్లుగా, వారి సైనిక రవాణా విమానాలు లేదా భారతీయ విమానాలతో రష్యా భూభాగం నుండి వారిని ఇంటికి పంపింస్తున్నామ‌ని తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసిన కొన్ని గంటల తర్వాత రష్యా మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. సంఘర్షణ ప్రాంతాల నుండి భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడంపై వారు చర్చించినట్లు సమాచారం.ఇద్దరు నాయకులు ఉక్రెయిన్‌లో పరిస్థితిని సమీక్షించారు… వారు సంఘర్షణ ప్రాంతాల నుండి భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడంపై చర్చించార‌ని ప్రధాన మంత్రి కార్యాలయం ప్ర‌క‌ట‌న ద్వారా తెలుస్తుంది.

ఇదిలావుండగా, 6000 మంది భారతీయులను వెనక్కి తీసుకువచ్చినట్లు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 20,000 మంది భారతీయులలో, 6,000 మందిని ఇప్పటివరకు దేశానికి తిరిగి తీసుకువచ్చారని.. మిగిలిన వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆయ‌న తెలిపారు.