Site icon HashtagU Telugu

Russia Ukraine War: ర‌ష్యా దాడిలో 300 మంది పౌరులు మృతి

Russia Ukraine44

Russia Ukraine44

ఉక్రెయిన్‌పై రష్యా ఉక్కుపాదం మోపుతోంది. బెలారస్ మీదుగా ఇప్పటికే రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోకి వ‌రుస బాంబు దాడుల‌తో ఉక్రెయిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ క్ర‌మంలో రాజధాని కీవ్ సహా అన్ని ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఉక్రెయిన్‌లోని కీవ్‌ ఎయిర్‌పోర్టు రష్యా సైన్యం అధీనంలోకి తీసుకుంది. సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న ర‌ష్యా, మ‌రోవైపు వైమానిక దాడులతో పాటు సరిహద్దుల నుంచి యుద్ధ ట్యాంకులను కూడా ఉక్రెయిన్‌లోకి తరలిస్తోంది.

ఉక్రెయిన్‌ను నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టి ముప్పేట దాడి చేస్తున్న ర‌ష్యా, పెద్ద ఎత్తున పారా ట్రూపర్‌లను రంగంలోకి దించింది. వైమానిక దాడుల్లో ఇప్పటికే ఉక్రెయిన్‌కు చెందిన సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో ఉక్రెయిన్‌ సైనికులు కూడా పెద్ద మొత్తంలో మరణించినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అలాగే ఉక్రెయిన్‌లోని ప‌లు న‌గ‌రాల్లో జ‌నావాసాల పై కూడా క్షిపణులుపడ్డాయి. దీంతో ప్రస్తుతానికి 300 మంది పౌరులు మ‌ర‌ణించార‌ని వార్త‌లు వ‌స్తున్నా, అమాయ‌క‌ పౌరుల మరణాలు కూడా పెద్ద సంఖ్యలో ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేప‌ధ్యంలో ప్రజలను బంకర్లలో తలదాచుకోవాలని ఉక్రెయిన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. జనావాసాలపై రష్యా దాడులకు దిగుతుండటంతో ప్రజలు తమంతట తాము రక్షించుకోవడానికి బంకర్లను ఆశ్రయించాలని ప్రభుత్వం కోరింది.