Yash Dhull: అరంగేట్రం మ్యాచ్ లోనే రెండు సెంచరీలు

భారత అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ యశ్ ధుల్ రంజీ ట్రోఫీలో దుమ్ము రేపుతున్నాడు. అరంగేట్రం చేసిన మ్యాచ్ లోనే రెండు సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

  • Written By:
  • Publish Date - February 20, 2022 / 07:06 PM IST

భారత అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ యశ్ ధుల్ రంజీ ట్రోఫీలో దుమ్ము రేపుతున్నాడు. అరంగేట్రం చేసిన మ్యాచ్ లోనే రెండు సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మంచి బౌలింగ్ ఎటాక్ ఉన్న తమిళనాడుపై యశ్ ఈ ఘనత సాధించడం విశేషం. ఈ మ్యాచ్ లో ఒక్కో ఇన్నింగ్స్ కు ఒక్కో సెంచరీ చొప్పున నమోదు చేశాడు. దీంతో నారీ కాంట్రాక్టర్ (గుజరాత్), విరాట్ స్వాతె (మహారాష్ట్ర) తర్వాత రంజీట్రోఫీ అరంగ్రేటంలోనే ఈ ఫీట్ సాధించిన మూడో భారత క్రికెటర్ గా ఘనత సాధించాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో 113పరుగులతో అజేయంగా నిలిచాడు. ధుల్ తో పాటు ధ్రువ్ షోరే (107 నాటౌట్)తో 228పరుగులు నమోదు చేశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో కూడా యశ్ దుల్ సెంచరీ చేశాడు. తద్వారా రంజీ అరంగేట్రంలోనే ఈ ఘనత సాధించిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరసన అరుదైన రికార్డ్‌లో యశ్ ధూల్ చోటు సంపాదించుకున్నాడు.

ఐపీఎల్‌-2022 మెగా వేలంలో యష్ ధుల్‌ను రూ. 50 ల‌క్ష‌ల‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అత‌డి కోసం మెగా వేలంలో పంజాబ్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కి ఢిల్లీ యష్ ధుల్‌ను దక్కించుకుంది. ఇటీవల భారత్ కు య‌ష్ ధుల్ అండర్ 19 వరల్డ్ కప్ అందించారు. అంతే కాదు ఈ మెగా టోర్నీలో అతడు బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన సెమీఫైనల్‌లో మ్యాచ్ విన్నింగ్ సెంచరీ న‌మోదు చేశాడు.