Site icon HashtagU Telugu

Class 2 students injured: కూలిన ప్రభుత్వ పాఠశాల స్లాబ్…ఇద్దరు విద్యార్థులకు గాయాలు..!!

students injured

students injured

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న విద్యార్థులపై సీలింగ్ ప్లాస్టర్ కూలింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గోనెగండ్ల మండల పరిషత్ ఉర్థూ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ పాఠశాల సుమారు ముప్పై సంవత్సరాల క్రితం నిర్మించబడిందని..పాఠశాల భవనం స్థితిగతులపై అధికారులకు నివేదిక సమర్పించామని మండల విద్యాధికారి తెలిపారు. భవనం శిథిలావస్థకు చేరుకుందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే చిన్నారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం నాడు నేడు పథకంలో ఇతర ప్రభుత్వ పాఠశాలలో పునరుద్ధరణ పనులు చేపట్టినా…గోనెగండ్ల ఉర్థూ పాఠశాల మరమ్మతు పనులను పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ పాఠశాలలో దాదాపు 66మంది విద్యార్థులకు కేవలం రెండు గదులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. గోనెగండ్ల మండలంలోని 55 ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు మొదటి రెండు దశల్లో ఎంపిక చేయని ఐదు పాఠశాలల్లో ఈ ఉర్ధూ పాఠశాల ఒకటని తెలిపారు.

ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విచారం వ్యక్తం చేశారు. నాడు-నేడు కింద వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎప్పుడు తప్పుడు ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తన తప్పులను అంగీకరించి..గాయపడిన చిన్నారుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.