Twitter Salute: శభాష్ పోలీస్: మంటల్లో దూకి, పసిబిడ్డను కాపాడి!

ఇటీవల కరౌలిలో జరిగిన మత హింసలో ఓ పసికందును రక్షించినందుకు రాజస్థాన్ పోలీసు కానిస్టేబుల్ ప్రశంసలు అందుకుంటున్నాడు.

  • Written By:
  • Updated On - April 5, 2022 / 04:41 PM IST

ఇటీవల కరౌలిలో జరిగిన మత హింసలో ఓ పసికందును రక్షించినందుకు రాజస్థాన్ పోలీసు కానిస్టేబుల్ ప్రశంసలు అందుకుంటున్నాడు. 31 ఏళ్ల నేత్రేష్ శర్మ మంటల్లో చిక్కుకున్న ఇద్దరు మహిళలతో పాటు, ఓ శిశువును కాపాడాడు. ‘‘ఉగాది పర్వదినం సందర్భంగా పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ ప్రారంభం కాగానే హింస చెలరేగింది. “నేను ఆరోజు విధుల్లో ఉన్నాను. విధుల్లో భాగంగా పెట్రోలింగ్‌ చేస్తుండగా మత ఘర్షణలు చెలరేగాయి. దీంతో పలు దుకాణాలకు నిప్పంటించారని, పోలీసులు మంటలను ఆర్పడంతో పాటు స్థానికులను రక్షించడంలో నిమగ్నమయ్యారు. అయితే ఇద్దరు మహిళలు రెండు దుకాణాల మధ్యలో చిక్కుకుపోయి ఉన్నారు. ఒకరి చేతిలో ఒక బిడ్డ ఉంది. ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే అక్కడికి పరుగెత్తాను. మహిళలు నన్ను సహాయం చేయమని వేడుకున్నారు. అప్పటికే శాలువాలో చుట్టబడిన బిడ్డను నాకు ఇవ్వమని చెప్పాను. బిడ్డను చేతుల్లోకి తీసుకొని వెంటనే పరుగెత్తాను’’ అని చెప్పాడు శర్మ.

పసిబిడ్డను చేతుల్లోకి తీసుకొని కానిస్టేబుల్ పరుగెత్తిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు.. మంటల్లో చిక్కుకున్న ఇద్దరు మహిళలు కూడా ధైర్యంగా కానిస్టేబుల్ వెంట పరుగెత్తి తమ ప్రాణాల్ని కాపాడుకోగలిగారు. కానిస్టేబుల్ ధైర్యం ప్రదర్శించడం పట్ల రాజస్థాన్ పోలీసులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వార్త వైరల్ కావడంతో నెటిజన్స్ సైతం శభాష్ పోలీస్ అంటూ మెచ్చుకుంటున్నారు. కానీ ఈ కానిస్టేబుల్ మాత్రం “కేవలం నేను డ్యూటీ మాత్రమే చేశాను” అని చెప్పాడు.