Site icon HashtagU Telugu

India’s World Cup: అపూర్వ విజయానికి 39 ఏళ్లు

World Cup

World Cup

ప్రపంచ క్రికెట్‌లో ఇప్పుడు ఇండియన్‌ టీమ్‌ ఓ సూపర్‌ పవర్‌. ఆటలో అయినా, ఆదాయంలో అయినా ఇండియన్‌ క్రికెట్‌కు తిరుగులేదు. అయితే దానికి 1983 వరల్డ్‌కప్‌లోనే బీజం పడింది. అప్పటికి రెండుసార్లు విశ్వవిజేత అయిన వెస్టిండీస్‌ను ఫైనల్లో మన కపిల్‌ డెవిల్స్‌ మట్టి కరిపించారు. ఆ మెగా టోర్నీ మొత్తం కెప్టెన్‌గా టీమ్‌ను ముందుండి నడిపించిన కపిల్‌.. ఆ తర్వాతి కాలంలో ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా నిలిచాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో కేవలం 183 రన్స్‌కే ఆలౌటైనా.. ఆ తర్వాత విండీస్‌ను 140 రన్స్‌కే కట్టడి చేసి ఎవరూ ఊహించని విజయాన్ని సాధించారు. ప్రతిష్టాత్మక లార్డ్స్‌లో బాల్కనీలో 1983 వరల్డ్‌కప్‌ను సగర్వంగా అందుకున్నాడు కపిల్‌ దేవ్‌. ఫైనల్‌ మ్యాచ్‌ డేంజరస్‌ వివ్‌ రిచర్డ్స్‌ను ఔట్‌ చేయడానికి కపిల్‌ దేవ్‌ వెనక్కి పరుగెత్తుతూ అందుకున్న క్యాచ్‌ క్రికెట్‌ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.
1983 వరల్డ్‌కప్‌లో మన టీమ్‌ ఇలాంటి అద్భుతం చేస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించలేదు.

కేవలం 24 ఏళ్ల 170 రోజుల వయసులో కపిల్‌ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఇప్పటి వరకూ వరల్డ్‌కప్‌ టైటిల్ అందుకున్న యంగెస్ట్‌ కెప్టెన్‌ అతడే. ఆ టోర్నీలో అజేయులుగా పేరున్న వెస్టిండీస్‌ టీమ్‌ను రెండుసార్లు ఓడించింది. 83 వరల్డ్ కప్ చారిత్రక విజయం సాధించి నేటితో 39 ఏళ్లు అయిన సందర్భంగా ట్విటర్‌లో ఫ్యాన్స్‌ సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఇండియన్‌ క్రికెట్‌ను మార్చేసిన రోజును గుర్తు చేసుకుంటూ.. కపిల్‌ డెవిల్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 1983 తర్వాత 28 ఏళ్లకు మళ్లీ 2011లో ధోనీ కెప్టెన్సీలో రెండోసారి వరల్డ్‌కప్‌ గెలిచింది.