Site icon HashtagU Telugu

Vaishali Takkar Death: విషాదం.. బుల్లితెర నటి ఆత్మహత్య

Imgonline Com Ua Resize L7y17hf86y

Imgonline Com Ua Resize L7y17hf86y

ప్రముఖ బుల్లితెర నటి, ‘ససురాల్‌ సిమర్‌ కా’ టీవీ షో ఫేమ్‌ వైశాలి ఠక్కర్‌ ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నివసిస్తున్న నటి వైశాలి ఠక్కర్ అక్కడే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. వైశాలి ఠక్కర్ ప్రసిద్ధ టీవీ సీరియల్ ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’లో పనిచేశారు. ఇది కాకుండా.. ఆమె ప్రముఖ సీరియల్ ‘ససురల్ సిమర్ కా’లో కూడా కనిపించింది. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కొన్ని మీడియా కథనాలలో కూడా చెబుతున్నారు. ప్రముఖ నటి మృతి అందరినీ కలిచివేసింది. వైశాలి మృతిపై తేజాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దాదాపు ఏడాది కాలంగా వైశాలి ఇండోర్‌లో నివసిస్తున్నట్లు సమాచారం.

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఆమె ‘దిల్ జిగర్ నాజర్ క్యా హై మైన్ తో తేరే లియే జాన్ భీ దే దూన్’ పాటను హమ్ చేస్తూ కనిపించింది. ఈ వీడియోలో ఆమె నవ్వుతూ ఆనందంగా ఉంది. నటి తరచుగా తన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకునేది.ఇప్పుడు హఠాత్తుగా ఆమె మృతి చెందిందనే వార్త అందర్ని దిగ్బ్రాంతికి గురిచేసింది.

ఆమె మృతదేహం వద్ద స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్‌లో ఏం రాసి ఉందనేది ఇంకా తెలియరాలేదు. ససురల్ సిమర్ కాలో అంజలి భరద్వాజ్ పాత్రను వైశాలి ఠక్కర్ పోషించింది. స్టార్ ప్లస్ షో.. యే రిష్తా క్యా కెహ్లతా హైతో వైశాలి ఠక్కర్ టీవీ అరంగేట్రం చేసింది. ఈ సీరియల్‌లో ఆమె 2015 నుండి 2016 వరకు సంజన పాత్రను పోషించింది. వైశాలి చివరిసారిగా రక్షాబంధన్ అనే టీవీ షోలో కనక్ సింగ్ ఠాకూర్ పాత్రలో కనిపించింది. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.