Site icon HashtagU Telugu

TS VS Centre: కేంద్రంతో తెలంగాణ మ‌రో ల‌డాయి

తెలంగాణ‌, కేంద్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య మ‌రో వివాదం వచ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే జాతీయ రాజ‌కీయాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అధికారాలు అన్నింటినీ కేంద్ర‌మే గుప్పిట పెట్టుకుంటోంద‌ని, రాష్ట్రాల ప‌వ‌ర్స్‌ను లాగేసుకుంటోంద‌ని ఆరోపించారు. ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ స్ఫూర్తికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న వ్యాఖ్య‌లు చేశారు మ‌ళ్లీ ఇప్ప‌డు బాయిల్డ్ రైస్ వ్య‌వ‌హారం రెండింటి మ‌ధ్య లొల్లికి దారి తీసేదిగా ఉంది. ఈ సారి బాయిల్డ్ రైస్‌ను కొనుగోలు చేసేది లేద‌ని ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది.

తెలంగాణ‌లో వేస‌విలో పండే వ‌రి పంట‌ను బాయిల్డ్ రైస్‌గా త‌ప్ప‌, ఇత‌రత్రా వినియోగించే అవ‌కాశం లేద‌ని, అలాంట‌ప్ప‌డు కొనుగోలు చేయ‌క‌పోతే ప‌రిస్థితి ఏమిట‌ని రాష్ట్రం ప్ర‌శ్నిస్తోంది. వేసవిలో పండే పంట‌ను బాయిల్డ్ రైస్‌గా కాకుండా రా రైస్‌గా మిల్లింగ్ చేస్తే సగం నూక‌లే వ‌స్తాయ‌ని చెబుతోంది. ఆ కార‌ణంగా ధ‌ర‌లు త‌గ్గి చివ‌ర‌కు రైతులే న‌ష్ట‌పోతార‌ని అంటోంది. బాయిల్డ్ రైస్‌ను తినేవారు లేర‌ని, కొనుగోలు చేసి తామేమి చేయాల‌ని ఎఫ్.సి.ఐ. అంటోంది. చివ‌ర‌కు ఇది టీఆర్ఎస్, బీజేపీల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి దారి తీయ‌నుంది. ఈ అంశంపై మ‌రోసారి చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నా, పెద్ద‌గా ఫ‌లితం ఉండ‌క‌పోవ‌చ్చు. రాష్ట్రంలో ఈ వేస‌విలో దాదాపు 24 ల‌క్ష‌ల ట‌న్నుల దిగుబ‌డి వ‌స్తుంద‌ని అధికారుల అంచ‌నా. ఇంత‌పంట‌ను ఎవ‌రు కొనుగోలు చేయాల‌న్న‌ది చివ‌ర‌కు సమస్యగా మార‌నుంది. అటుతిరిగి, ఇటు తిరిగి అది సెంట‌ర్‌- స్టేట్ వివాదంగా మారి రాజ‌కీయ‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.