Tummala Nageswara Rao : తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిజం చేస్తూ ప్రజల కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. వ్యవసాయ, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటికే రూ. 2 లక్షల రైతు రుణమాఫీని అమలు చేసింది. మొత్తం నాలుగు విడతల్లో సుమారు 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 22 వేల కోట్ల నగదును జమ చేసింది. తాజాగా, రాష్ట్రంలోని చేనేత రంగానికి కొత్త ఉత్సాహం కలిగించేలా చేనేత కార్మికులకు కూడా మంచి శుభవార్తను తెలియజేశారు. చేనేత అభయహస్తం పథకం పేరుతో రూ. 238 కోట్ల నిధులతో చేనేత రంగం సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
నేతన్నలకు ఆర్థిక ఉపశమనం
అన్నదాతల మాదిరిగా చేనేత కార్మికులకూ రుణమాఫీకి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని, ఆర్థిక శాఖ ఆమోదం అనంతరం వెంటనే అమలు చేస్తామని వెల్లడించారు. బతుకమ్మ చీరల పంపిణీతోపాటు ఇతర పథకాల కింద ఇప్పటికే రూ. 428 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. 10 శాతం నూలు సబ్సిడీ కింద రూ. 37.49 కోట్లు, మరమగ్గాల పథకం కింద రూ. 5.45 కోట్లు, పావలావడ్డీ కింద రూ. 1.09 కోట్ల నిధులను అందించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేనేత, జౌళి శాఖకు సంబంధించిన బకాయిలను చెల్లించనందున ఆ భారం నేడు ప్రస్తుత ప్రభుత్వంపై పడిందని, వాటి క్లియరెన్స్ కోసం కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పనలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖలు తమ అవసరాల కోసం టెస్కో ద్వారా మాత్రమే చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని, ప్రైవేటు సంస్థల వద్ద కొనుగోలు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నూతన పథకాల రూపకల్పన
ఏకరూప చీరల పంపిణీ: ప్రతి ఏడాది 64.70 లక్షల స్వయంసహాయక సంఘాల మహిళలకు రెండు చొప్పున ఏకరూప చీరల పంపిణీ చేపట్టనున్నట్లు వివరించారు.
శాశ్వత క్యాంపస్ నిర్మాణం: జాతీయ చేనేత సాంకేతిక సంస్థ (IIHT)కి శాశ్వత క్యాంపస్ నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందని తెలిపారు.
ప్రభుత్వ కట్టుబాటు: చేనేతల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. నేతన్నకు చేయూత పథకంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ, వారికి ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు. తెలంగాణ నేతన్నలకు రక్షణ కవచంగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
Threat Call : పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరించిందెవరో తెలుసా..?