TTD Chairman BR Naidu : తెలంగాణకు చెందిన కీలక నేతలతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వరుసగా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని హరీష్ రావు నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బీఆర్ నాయుడిని శాలువాతో సత్కరించి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల ఆలయ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మీడియా రంగంలో సుదీర్ఘకాలంగా విశేష సేవలు అందించిన నాయుడికి తిరుమల శ్రీవారికి సేవ చేసే భాగ్యం పొందడం అదృష్టమని హరీష్ రావు అన్నారు.
ఇకపోతే.. తిరుమలలో శ్రీవెంటకటేశ్వర స్వామి దర్శనం కోసం తెలంగాణ నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నందున, తెలంగాణ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలనిఈ సందర్భంగా బీఆర్ నాయుడిని హరీష్ రావు కోరారు. తెలంగాణ భక్తులకు దర్శనం, వసతి వంటి సేవలను మెరుగుపరచడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. అయితే హరీష్ రావు విజ్ఞప్తికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి, టీటీడీ బోర్డులో చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సిద్దిపేటలో కూడా టీటీడీ దేవాలయం నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నందున, నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని హరీష్ రావు కోరారు. సిద్దిపేటతో పాటు కరీంనగర్‌లో నిర్మాణంలో ఉన్న టీటీడీ దేవాలయ పనులను పూర్తి చేసేందుకు బోర్డులో చర్చిస్తామని నాయుడు తెలిపారు. ఇటీవల బీఆర్ నాయుడు ముఖ్యమంత్రి రేవంత్, మాజీ మంత్రి కేటీఆర్‌లను కలిసిన విషయం తెలిసిందే.
Read Also: Ponnam Prabhakar: పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు.. లబ్ధిదారుల ఎంపికపై పొన్నం కీలక ప్రకటన…