TTD : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 18 నుంచి ఏప్రిల్ నెల కోటా టికెట్లను ఆన్ లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఏప్రిల్ నెలకు సంబంధించి.. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీ డిప్ కోసం 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకూ నమోదు చేసుకోవచ్చని తెలిపింది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన భక్తులు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు రుసుము చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
అలాగే జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వర్చువల్ సేవా టోకెన్లను 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవారి వార్షిక వసంతోత్సవం ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ టికెట్లను జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
జనవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లను విడుదల చేయనున్నారు. అదేరోజున ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ కోటాలో బ్రేక్ దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 స్పెషల్ దర్శనం టోకెన్లను, మధ్యాహ్నం 12 గంటలకు వసతి గదుల కోటా, 27వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవా కోటా టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.
కాగా.. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వారంరోజులుగా తిరుమలలో శ్రీవారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. అలిపిరి మెట్లమార్గంలో వేలాది భక్తులు గోవింద నామస్మరణతో కాలినడకన వస్తున్నారు. మంగళవారం స్వామివారిని 73,016 మంది భక్తులు దర్శించుకోగా.. 20,915 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. మంగళవారం హుండీకానుకల ద్వారా శ్రీవారికి రూ.3.46 కోట్ల ఆదాయం వచ్చింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు సంక్రాంతి సెలవులను పొడిగించింది. ఈనెల 19 వరకూ సెలవులు ఉండగా.. మరో రెండ్రోజులు సెలవులను పొడిగించింది. జనవరి 22 సోమవారం నుంచి స్కూళ్లు తెరచుకోనున్నాయి.