Japan: కొత్త ఏడాది.. తొలిరోజే తూర్పు ఆసియా ద్వీపదేశమైన జపాన్ వరుస భూకంపాలతో వణికిపోయింది. ఆ తర్వాత తీర రాష్ట్రాల్లో సునామీ సంభవించింది. కేవలం గంటన్నరలో21సార్లు భూమి కంపించింది. తీరప్రాంత వాసులంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. మరిన్ని ప్రకంపనలొచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికలతో.. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
భూకంపం తర్వాత టయోమా, ఇషికావా, న్నిగాటాలో సుమారు 35 వేల నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇతర నష్టాల వివరాలు తెలియాల్సి ఉంది. జపాన్ తో పాటు ఉత్తరకొరియా, రష్యాకు సైతం సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ హెచ్చరికలను రష్యా అధ్యక్ష కార్యాలయం కూడా ధృవీకరించింది. జపాన్ కు సమీపంలో ఉన్న సఖాలిన్ ద్వీపంలో కొన్నిప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు రష్యా ఎమర్జెన్సీ మంత్రి వెల్లడించారు. 2 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉండటంతో.. ఉత్తర కొరియా తన రేడియో ఛానెల్ ద్వారా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు జపాన్ లోని భారత రాయబార కార్యాలయం.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సహాయం కోసం +81-80-3930-1715, +81-70-1492-0049, +81-80-3214-4734, +81-80-6229-5382, +81-80-3214-4722 నంబర్లను సంప్రదించాలని సూచించింది.