TSRTC: ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టం అమలుపై చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు

  • Written By:
  • Publish Date - June 16, 2024 / 05:07 PM IST

TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టం (ఏఎఫ్‌సీఎస్‌) అమలు విషయంలో చేస్తోన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు అని టీఎస్ ఆర్టీసీ స్పందించింది. ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు మేరకు బోర్డు అనుమతితోనే ఈ వ్యవస్థను సంస్థ అమలు చేయడం జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించిందని చేస్తోన్న నిరాధారమైన ఆరోపణలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం  ఖండిస్తోంది. నియమ నిబంధనలకు లోబడి బోర్డు అనుమతితోనే సంస్థలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేస్తోంది.

అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంను అమలు చేయాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం 2022లోనే నిర్ణయించింది. బస్సుల్లో యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులతో కూడిన డిజిటల్ పేమెంట్స్, స్మార్ట్ కార్డ్స్, మొబైల్ టికెట్స్, మొబైల్ బస్ పాస్ ల  సౌకర్యం కల్పిస్తూ.. సేవలను మరింతగా సులభతరం చేయడమే ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. ఈ వ్యవస్థ వల్ల రియల్ టైం సమాచారం ఎప్పటికప్పుడు క్షణాల వ్యవధిలో సంస్థకు తెలుస్తుంది. ఈ సమాచారంతో ప్రయాణికుల డిమాండ్ మేరకు రద్దీని బట్టి సర్వీసులను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుత టికెటింగ్ వ్యవస్థ కంటే ఇది ఎంతో మెరుగైనది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న మహాలక్ష్మి – మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు స్మార్ట్ కార్డులు జారీ  చేయాలని భావిస్తున్నందున.. ఛలో మొబిలిటీ అనుభవం ఉపయోగపడుతుందని గుర్తించింది. సంస్థకు సాంకేతికపరమైన భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కంపెనీ సరైనదని కమిటీ నిర్ధారించింది.  పలు దఫాలుగా ఛలో మొబిలిటీతో చర్చించింది. ఇతర రాష్ట్రాల రేట్ల ను పరిశీలించింది. తక్కువ ధరకు ఇక్కడ ఏఎఫ్‌సీఎస్‌ అమలుకు అంగీకరించడంతో.. ఆ కంపెనీతో ఒప్పందం చేసుకోవాలని సూత్రప్రాయంగా సంస్థ నిర్ణయించి.. బోర్డుకు సిఫారసు చేసింది. ఉన్నతస్థాయి కమిటీ నివేదిక ఆధారంగా బోర్డు అనుమతితో 15.03.2024 నాడు చలో మొబిలిటీకి లెటర్ ఆఫ్ ఇంటెంట్(ఎల్ఓఐ) ఇవ్వడం జరిగింది.