TSRTC: బస్ పాస్ ఛార్జీలను పెంచేశారు

క్రూడాయిల్ ధరలు పెంచేశారని.. ఇక్కడ మనవాళ్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేస్తున్నారు.

  • Written By:
  • Updated On - March 26, 2022 / 02:31 PM IST

ఉల్లిపాయ్, మిరపకాయ్, కందిపప్పు, మినపప్పు.. తోటకూర, పాలకూర.. ఇలా కాదేదీ ధరలు పెంచడానికి అనర్హం అన్నట్టుంది పరిస్థితి. క్రూడాయిల్ ధరలు పెంచేశారని.. ఇక్కడ మనవాళ్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేస్తున్నారు. ఆ ఎఫెక్ట్ ఆర్టీసీపైనా పడింది. ఇప్పటికే సిటీ బస్ ఛార్జీలను పెంచేశారు. ఇప్పుడు సిటీ బస్ పాస్ ఛార్జీలపైనా బాదేశారు. దీంతో సగటు బస్సు ప్రయాణికులు.. బస్ లో ప్రయాణించాలో వద్దో కూడా తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రూ.950 ఉన్న ఆర్డినరీ పాస్ ఇప్పుడు రూ.1150 అయ్యింది. మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ కు ఇప్పటివరకు రూ.1070 వసూలు చేస్తుండగా.. ఇకపై రూ.1300 చెల్లించాలి. మెట్రో డీలక్స్ కు రూ.1185 చెల్లిస్తుండగా.. ఇక నుంచి రూ.1450 ఇవ్వాల్సి ఉంటుంది. మెట్రో లగ్జరీ పాస్.. రూ.2000 ఉన్నది కాస్తా.. రూ.2400 అయ్యింది. అదే పుష్పక్ పాస్ ని చూస్తే.. రూ2500 ఉన్నదానిని రూ.3000 కు పెంచారు.

ఎన్జీవో బస్ పాస్ ల రేట్లు కూడా పెరిగాయి. ఆర్డినరీ బస్ పాస్ రేటు రూ.320 నుంచి రూ.400కు పెరిగింది. మెట్రో ఎక్స్ ప్రెస్ రూ.450 నుంచి రూ.550 అయ్యింది. మెట్రో డీలక్స్ రూ.575 నుంచి రూ.700 చేశారు. ఎంఎంటీఎస్ కాంబో టిక్కెట్ రేటు కడా భారీగా పెరిగింది. ఇప్పటివరకు ఇది రూ.1090 ఉంటే.. ఇక నుంచి రూ.1350 అవుతుంది. ఆమధ్య చిల్లర సమస్య రాకూడదని, సేఫ్టీ సెస్ పేరుతోను టిక్కెట్ పై రూపాయిని పెంచేశారు. ఇప్పుడు బస్ పాస్ ఛార్జీలను కూడా పెంచారు. ఇప్పుడీ బస్ పాస్ ఛార్జీ పెంపులో అసలు ట్విస్ట్ ఏమిటంటే.. ఈ పెంచిన ధరలు జస్ట్ ఇప్పటివే. అసలైన ఆర్టీసీ ఛార్జీల పెంపు ఫైల్.. ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దే పెండింగులో ఉంది. ఒకవేళ కేసీఆర్ కాని ఆ ఫైల్ ప్రపోజల్ ను ఓకే చేస్తే.. ఛార్జీలు ఇంకా పెరిగే ఛాన్సుంది. దీంతో మిన్ను విరిగి మీద పడడమంటే ఇదే అని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు.