Site icon HashtagU Telugu

TSRTC Bill Merger : రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరిన ఆర్టీసీ ఉద్యోగులు

Tsrtc Bill Merger

Tsrtc Bill Merger

ఆర్టీసీ విలీన బిల్లు (TSRTC merger bill)కు గవర్నర్ ఆమోదం తెలపాలంటూ ఆర్టీసీ ఉద్యోగులు రాజ్ భవన్ (Raj Bhavan) ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆర్టీసీ డ్రైవర్లు , కండక్టర్లు హైదరాబాద్ కు చేరుకున్నారు. కొద్దీ సేపటిక్రితమే ఇందిరా పార్క్ నుండి ర్యాలీగా రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు కనుక పెట్టలేకపోతే.. శాసనసభ ఎన్నికలు పూర్తయ్యేవరకు వాయిదా పడినట్టే. వేలమంది జీవితాలతో ముడిపడి ఉన్న బిల్లుకు కీలక సమయంలో గవర్నర్ ఇలా చేయడం మంచిది కాదని ఉద్యోగులు అంటున్నారు. ఈ బిల్లు ప్రవేశ పెడితే మా బతుకులు బాగుపడతాయని..ప్రభుత్వంలో విలీన అంశం ఇప్పటిది కాదని ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉందని , పెద్ద మనసు చేసుకొని గవర్నర్ బిల్లుపై సంతకం పెట్టాలని వారంతా కోరుతున్నారు.

గవర్నర్‌ తీరుకు నిరసనగా శనివారం ఉదయం బస్ డిపోల వద్ద కార్మికులు (TSRTC Employees) నిరసనలు తెలిపారు. ఏ ఒక్క బస్ కూడా డిపోల నుండి బయటకు రాలేదు. దాదాపు రెండు గంటల సేపు నిరసన వ్యక్తం చేసారు. ఉదయం 8 తర్వాత బస్సులు రోడ్డెక్కాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్‌ మానవీయ కోణంలో తీసుకొన్న నిర్ణయాన్ని గవర్నర్‌ నిర్దయగా అణగతొక్కుతున్నారని BRS నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుమతించకుండా తాత్సారం చేస్తున్నారు. ఇప్పటికే పలు బిల్లులను కావాలనే కక్షపూరితంగా నెలలపాటు తొక్కిపెట్టిన గవర్నర్‌ .. ఇప్పుడు 43 వేల మందికిపైగా కార్మికుల కుటుంబాలతో ముడిపడి ఉన్న ఆర్టీసీ బిల్లుపై కూడా అదే స్థాయిలో తాత్సారానికి తెరలేపారని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును పాస్‌ చేయిస్తే కార్మికుల కుటుంబాలకు సత్వరమే లాభం కలుగుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముసాయిదా బిల్లును రాజ్‌భవన్‌కు పంపించి అనుమతి కోరిందని , కానీ బిల్లుకు రాజ్‌భవన్‌ మోకాలడ్డుతున్నదని నేతలు వాపోతున్నారు. బిల్లులోని పలు అంశాలపై సందేహాలున్నాయని, వాటిపై ప్రభుత్వం నుంచి వివరణ కోరామని బిల్లు పంపిన రెండురోజుల తర్వాత శుక్రవారం రాత్రి రాజ్‌భవన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం రాజ్ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకొని , లోపలి ఉద్యోగులు వెళ్లకుండా భారీ గేట్లు ఏర్పాటు చేసారు.

Read Also : Jyothi Yarraji : తెలుగు కెరటం జ్యోతి యర్రాజీకి కాంస్యం.. వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో ప్రతిభ