Site icon HashtagU Telugu

Trump Threatens India : ఆ ట్యాక్స్ తో.. ఇండియాపై ప్రతీకారం తీర్చుకుంటా : ట్రంప్

Donald Trump

Trump Threatens India :  ఓ వైపు రేప్ కేసులు.. మరోవైపు దేశ ద్రోహం కేసుల ఊబిలో చిక్కుకున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇండియాపై విషం కక్కాడు. తన మనసులో దాగి ఉన్న రాజకీయ కుట్రను అందరి ముందు  బయట పెట్టుకున్నాడు. అమెరికా ఉత్పత్తులపై ఇండియా భారీగా ట్యాక్స్ వేస్తోందంటూ చిందులు వేశాడు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ గెలిస్తే.. ఇండియా ప్రోడక్ట్స్ పై భారీగా ట్యాక్స్ (Reciprocal Tax)  వేసి ప్రతీకారం  తీర్చుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. హార్లే-డేవిడ్‌సన్‌ లాంటి అమెరికా ఉత్పత్తులపై భారత్‌ పెద్ద మొత్తంలో టారిఫ్‌లు విధిస్తోందని చెప్పాడు. ఇండియాలో 100 శాతం, 150 శాతం, 200 శాతం పన్నులు ఉన్నాయని.. ఇలా అయితే అమెరికా కంపెనీలు భారత్‌తో ఎలా వ్యాపారం చేయగలవు అని ట్రంప్ కామెంట్ చేశారు. “అమెరికా కంపెనీలు భారత్ లో ప్లాంట్స్ ఏర్పాటు చేస్తే మాత్రం ఇలాంటి భారీ ట్యాక్స్ లు వేయడం లేదు. అమెరికా కంపెనీలను తమ దేశం వైపు లాగాలని ఇండియా భావిస్తోంది” అని ట్రంప్‌ ఆరోపించారు.  డొనాల్డ్‌ ట్రంప్‌ .. రిపబ్లికన్ పార్టీ నాయకుడు. ఈ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ కూడా ఉన్నారు.  వీరి నుంచి భారీ పోటీని ఎదుర్కొంటున్న ట్రంప్ ఇప్పుడు ఒత్తిడిలో ఇండియాపై ఇలాంటి విమర్శలు చేశాడు.

ట్రంప్‌ హయాంలోనే ఇండియాకు జీఎస్‌పీ హోదా రద్దు  

ప్రధాని మోడీకి సన్నిహితంగా ఉన్నప్పటికీ.. 2019లో ట్రంప్‌ (Trump Threatens India) అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే భారత్‌కు జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్స్‌స్‌ (జీఎస్‌పీ) హోదా రద్దు అయింది. ఈ హోదా ఉంటే అమెరికాకు ట్యాక్స్ లేకుండా ప్రోడక్ట్స్ ను మనం  ఎగుమతి చేసే వీలుంటుంది. జీఎస్‌పీ హోదాను మళ్లీ  పునరుద్ధరించేందుకు ఇరు దేశాల మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.