Donald Trump : 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపధ్యంలో, నవంబర్‌లో జరగనున్న పోలింగ్ కోసం ప్రచారం మరింత ఉధృతంగా సాగుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు మద్దతుగా ప్రపంచ ప్రసిద్ధ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ను ఎన్నికల ప్రచారంలోకి తీసుకొచ్చారు. జులై నెలలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ప్రదేశమైన పెన్సిల్వేనియాలోని బట్లర్ నగరంలో ఇద్దరూ కలిసి ప్రచార సభలో పాల్గొన్నారు.
ప్రచార సభలో, ట్రంప్ తనపై హత్యాయత్నం చేసిన మాథ్యూ బ్రూక్స్‌ను “దుష్ట రాక్షసుడు”గా అభివర్ణిస్తూ, ఆ దాడి గురించి ప్రసంగించారు. ఆయన అనుభవాలను గుర్తు చేసుకుంటూ, ‘‘సరిగ్గా 12 వారాల క్రితం, ఇదే మైదానంలో ఒక హంతకుడు నన్ను చంపడమే లక్ష్యంగా తుపాకీ కాల్పులు జరిపాడు. కానీ నేను ఇప్పటికీ ఇక్కడ నిలబడి ఉన్నాను. నన్ను ఏదీ ఆపలేదని,’’ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు ఆయన సహసాన్ని, పట్టుదలను ప్రతిబింబిస్తున్నాయి. ఆయన తర్వాత ఎలాన్ మస్క్‌ను వేదికపైకి ఆహ్వానించారు, మస్క్‌ను అద్భుతమైన వ్యక్తిగా ప్రశంసించారు.
Read Also : Women’s T20 World Cup : సై అంటున్న భారత్.. పాక్ దుబాయ్ లో హైవోల్టేజ్ ఫైట్
ఇక, ఎలాన్ మస్క్ ప్రచార సభలో పాల్గొని ట్రంప్‌పై తన మద్దతును ఘనంగా ప్రకటించారు. ‘‘ఒక అధ్యక్షుడు మెట్లు ఎక్కడానికి కూడా ప్రయత్నిస్తుంటే, మరొకరు తుపాకీ కాల్పుల తర్వాత కూడా పిడికిలి ఎత్తి నిలబడుతున్నారు,’’ అంటూ జో బైడెన్‌తో పోల్చుతూ ట్రంప్ ధైర్యాన్ని, పట్టుదలను ప్రస్తావించారు. ‘‘అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ట్రంప్ విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికలు అమెరికా ప్రజల జీవితాల్లో అత్యంత ముఖ్యమైనవి,’’ అని మస్క్ పేర్కొన్నారు.
ప్రచార సభకు వచ్చిన వారిని ఉద్దేశించి మస్క్ మాట్లాడుతూ, ‘‘మీకు తెలిసిన ప్రతీ ఒక్కరినీ ట్రంప్‌కు ఓటు వేయమని చెప్పండి. ఈ ఎన్నికలు మన భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి,’’ అని ప్రజలను ప్రేరేపించారు. దాదాపు 7 నిమిషాలపాటు తన ప్రసంగాన్ని కొనసాగించిన మస్క్, ‘‘పోరాడండి, పోరాడండి, పోరాడండి, ఓటు వేయండి, ఓటు వేయండి,’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
జులై 13న డొనాల్డ్ ట్రంప్‌పై పెన్సిల్వేనియాలోని బట్లర్ నగరంలో హత్యాయత్నం జరిగింది. ట్రంప్ ప్రచార సభలో ప్రసంగిస్తుండగా, థామస్ మ్యాథ్యూ బ్రూక్స్ అనే 23 సంవత్సరాల యువకుడు తుపాకీతో ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవిని తాకి దూసుకెళ్లింది, అయితే తక్కువ తీవ్రత కలిగి ఉండడంతో ఆయన ప్రాణాలు దక్కాయి. కాల్పుల అనంతరం అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు వెంటనే స్పందించి, దాడిచేసిన వ్యక్తిని కాల్చిచంపారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది, కానీ ట్రంప్ తాను సజీవంగా బయటపడటాన్ని దేవుడి ఆశీర్వాదంగా భావించి ప్రచారాన్ని ఆపకుండా కొనసాగిస్తున్నారు.
Read Also : Junior Assistant: జూనియర్ అసిస్టెంట్లకు తెలంగాణ ప్రభుత్వ దసరా కానుక.. ఈవోలుగా ప్రమోషన్..