TRS leader: రేవంత్ ను రైతులు రాళ్లతో కొట్టి చంపుతారు

సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆరెస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.

  • Written By:
  • Updated On - May 19, 2022 / 03:22 PM IST

సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆరెస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవికి విలువ ఇవ్వకుండా మాట్లాడితే…నాలుక తెగ్గొస్తామని హెచ్చరించారు. అవగాహన రాహిత్యంతో మాట్లాడితే రైతులే రాళ్లతో కొట్టి చంపుతారన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని పార్లమెంట్ సాక్షిగా రేవంత్ అడిగిన ప్రశ్నకే కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి నరేంద్రసింగ్ తోమర్ జవాబు చెప్పారని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో 2014 నుంచి రైతు ఆత్మహత్యలు తగ్గాయని ఎన్.సీ.ఆర్బీ వెల్లడిస్తే…రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 8,011 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలు పెరిగాయన్న సంగతిని పక్కన పెట్టి.. రాష్ట్రంపై విషం చిమ్ముతున్న రేవంత్ నాలుక కోస్తామని హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు భీమా పథకాలను ప్రవేశపెట్టి రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. ఏ కారణంతో రైతు మరణించినా రూ. 5 లక్షల భీమా చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. ఇప్పటివరకు 74 వేల కుటుంబాలను రైతు భీమా ద్వారా భరోసా కల్పించామని వెల్లడించారు. 2014, 2018 ఎన్నికల్లో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించినా కాంగ్రెస్ ను రైతులు నమ్మలేదన్నారు. రైతు సంక్షేమ కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్లు తిడితే…రేవంత్ ను రైతులు రాళ్లతో కొట్టి చంపుతారని హెచ్చరించారు.