TRS: ‘మోడీ గారూ..! రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ ఏమైంది..?’

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ మాటలు నీటి మూటలుగా మారాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు.

  • Written By:
  • Publish Date - April 10, 2022 / 10:09 PM IST

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ మాటలు నీటి మూటలుగా మారాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు.

వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో నిర్వహించనున్న దీక్ష ఏర్పాట్లను ఎంపీలు కే.ఆర్. సురేష్ రెడ్డి, బీ.బీ.పాటిల్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సహా పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి బోయినపల్లి వినోద్ కుమార్ ఆదివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఆరేళ్ళ క్రితం హామీ ఇచ్చారని, ఆ హామీ ఏమైంది అని ప్రశ్నించారు.

వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, రైతుల స్థితిగతులను, కేంద్ర బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.

దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2016 ఫిబ్రవరిలో ప్రకటించారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతుల ఆదాయం విషయం పట్టించుకున్న పాపాన పోలేదని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ మాటలు అమలు కావడం లేదన్న విషయం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన నివేదికతో స్పష్టం చేసిందని, కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరితో దేశంలో రైతుల ఆదాయం మరింత దిగజారిపోయిందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని గత కొంతకాలంగా పలు రూపాల్లో టీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిందని, సోమవారం ఢిల్లీలో దీక్ష నిర్వహించడం ద్వారా కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచనున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు.

ఢిల్లీ దీక్షలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని అన్ని శ్రేణుల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు దేశ రాజధానికి చేరుకున్నారని వినోద్ కుమార్ తెలిపారు.

రానున్న రోజుల్లో వరి ఆందోళన కార్యక్రమాలు ఎలా ఉండాలో పార్టీ అధినేత కేసీఆర్ దిశా నిర్ధేశం చేస్తారని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పుష్కలంగా నీళ్లు, విద్యుత్ అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప నాయకులు కేసీఆర్ అని వినోద్ కుమార్ వివరించారు.