PM Modi: ఏపీ విభ‌జ‌న గాయం పై ప్ర‌ధాని మోదీ కారం.. టీఆర్ఎస్ ఆందోళ‌న‌లు షురూ..!

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ర‌చ్చ లేపుతున్నారు.

  • Written By:
  • Updated On - February 9, 2022 / 03:31 PM IST

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ర‌చ్చ లేపుతున్నారు. తాజాగా రాజ్య‌స‌భ వేదిక‌గా ఏపీ పున‌ర్విభ‌జ‌న పై మాట్లాడుతూ.. తాము రాష్ట్ర విభ‌జ‌న‌కు వ్య‌తిరేకం కాద‌ని, అయితే విభ‌జ‌న జ‌రిగిన పద్ద‌తి స‌రిగ్గా లేద‌న్నారు మోదీ. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రాజ‌కీయ స్వార్ధం కోసం ఏపీని హాడావుడిగా విభ‌జించార‌ని, తలుపులు మూసి, మైకులు క‌ట్ చేసి, పెప్పర్ స్ప్రే కొట్టారని, ఎలాంటి చర్చ జరగకుండానే విభజన బిల్లును ఆమోదించారని కాంగ్రెస్ పై ప్ర‌ధాని మోదీ మండిపడ్డారు. రాజకీయ స్వార్థం కోసం ఏపీని హడావుడిగా విభజించారని, కలిసి చర్చిస్తే రాష్ట్ర విభజన శాంతియుతంగా జరిగేదని న‌రేంద్ర మోదీ నాటి కాంగ్రెస్ తీరును ఎండ‌గ‌ట్టారు.

ఇక ప్ర‌ధాని వ్యాఖ్య‌ల పై ఇప్ప‌టికే ఒక‌వైపు కాంగ్రెస్ నేత‌లు కౌంట‌ర్లు ఇస్తుండ‌గా, మ‌రోవైపు తెలంగాణ టీఆర్ఎస్ నేత‌లు కూడా మోదీ పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు భారీ ఆందోళనలకు దిగుతున్నారు. ఖ‌మ్మంలో ఏర్పాటుచేసిన నిరసన ర్యాలీలో భాగంగా న‌రేంద్ర మోదీ శవయాత్రలో మంత్రి పువ్వాడ అజయ్, జిల్లా అధ్యక్షుడు తాత మధు పాల్గొన్నారు. మ‌రోవైపు అంబేద్కర్ సెంటర్‌లో టీఆర్ఎస్ నాయకులు మానవహారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర‌ వ్యాప్తంగా ప్ర‌ధాని మోదీపై పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వెలువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మ‌రోసారి విషం చిమ్మిన న‌రేంద్ర‌ మోదీ వైఖ‌రిని ఎండ‌గ‌డుతూ ఆయ‌న దిష్టిబొమ్మ‌ల‌ను ద‌హ‌నం చేస్తున్నారు. అలాగే అన్ని జిల్లాల్లో న‌ల్ల బ్యాడ్జీలు ధ‌రించి మోదీ వ్యాఖ్య‌ల పై టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న తెల్పుతున్నారు.