Operation Ganga : ఉక్రెయిన్ ర‌ష్యా సంక్షోభం.. మూడ‌వ రోజు కొన‌సాగుతున్న భార‌తీయుల‌ త‌ర‌లింపు ప‌క్రియ‌

  • Written By:
  • Updated On - March 1, 2022 / 09:38 AM IST

రష్యా సైనిక దాడి తర్వాత ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భార‌తీయుల త‌ర‌లింపు ప‌క్రియ కొన‌సాగుతుంది. 489 మంది భారతీయ పౌరులతో సోమవారం రొమేనియా రాజధాని బుకారెస్ట్, హంగేరియన్ రాజధాని బుడాపెస్ట్ నుండి రెండు విమానాలు ఢిల్లీకి చేరుకున్నాయ‌ని అధికారులు తెలిపారు. స్పైస్‌జెట్, ఇండిగో మరియు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వంటి ఇతర ప్రైవేట్ క్యారియర్‌లు కూడా ఉక్రెయిన్ గగనతలం మూసివేయబడినందున భారతీయుల తరలింపు కోసం తమ విమానాలను రెండు నగరాలకు పంపాయి.రొమేనియా, హంగేరీ నుండి భారతదేశం తన పౌరుల తరలింపును శనివారం ప్రారంభించింది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఇప్పటివరకు ఆరు విమానాలలో 1,396 మంది భారతీయ పౌరులను త‌ర‌లించింది.

సోమవారం ఐదవ ఎయిర్ ఇండియా విమానం 249 మంది భారతీయ పౌరులతో బుకారెస్ట్ నుండి ఢిల్లీకి రాగా, ఆరవ విమానం 240 మంది భారతీయులతో బుడాపెస్ట్ నుండి వచ్చిందని అధికారులు తెలిపారు. దాదాపు 14,000 మంది భారతీయులు, ప్రధానంగా కళాశాల విద్యార్థులు, ప్రస్తుతం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరే ఈ ప్రత్యేక విమానం కోసం బోయింగ్ 737 మ్యాక్స్ విమానాన్ని ఉపయోగించనున్నట్లు స్పైస్‌జెట్ తెలిపింది. విమానం ఢిల్లీ నుండి బుడాపెస్ట్‌కు వెళ్తుంద‌ని.. తిరుగు ప్రయాణం జార్జియాలోని కుటైసి మీదుగా న‌డుస్తుంద‌ని స్పెస్ జెట్ తెలిపింది. మరిన్ని తరలింపు విమానాలను నడపాలని యోచిస్తున్నామని, సంబంధిత అధికారులతో చర్చిస్తున్నామని స్పైస్‌జెట్ తెలిపింది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 182 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి బుకారెస్ట్-ముంబై విమానాన్ని నడుపుతుందని తెలిపింది. ఉక్రెయిన్‌లో సంక్షోభం నేపథ్యంలో భారతీయ పౌరులను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి A321 విమానాలను ఉపయోగించి రెండు తరలింపు విమానాలను నడుపుతున్నట్లు ఇండిగో తెలిపింది. ఈ రెండు విమానాలు మంగళవారం ఢిల్లీలో ల్యాండ్ అవుతాయని పేర్కొంది