Site icon HashtagU Telugu

Hyderabad: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం, ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి!

Hyderabad: సోమవారం పటాన్‌చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ)కి చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. 19 ఏళ్ల ఆర్ భరత్ చంద్ర, 18 ఏళ్ల పి సునీత్, 19 ఏళ్ల ఎం వంశీ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుని బైక్‌పై వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. పటాన్‌చెరువు రోడ్డులో డ్రైవర్‌ రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. భరత్ చంద్ర, సునీత్ అక్కడికక్కడే మృతి చెందగా, పోలీసులు అంబులెన్స్‌ లో వంశీని ఆస్పత్రికి తరలించారు.

డిసెంబర్ 31వ తేదీ రాత్రి రోడ్డు ప్రమాదాలు, ఇతర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జనవరి 1వ తేదీ ఉదయం వరకు సైబరాబాద్ పోలీసులు 74 బృందాలు సైబరాబాద్ వ్యాప్తంగా డ్రంక్ డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 1241 మందిని పట్టుకుని వారిపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన 1241 మందిలో 1239 మంది పురుషులు, 2 మహిళలున్నారు. మద్యం అమ్మకాలు కూడా రికార్డ్ స్థాయిలో జరిగాయని సంబంధిత అధికారులు తెలిపారు.