Site icon HashtagU Telugu

Hyderabad: హైద‌రాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic

Traffic

హైదరాబాద్‌లో రేపు (ఆదివారం) ట్రాఫిక్ ఆంక్ష‌లు కొన‌సాగ‌నున్నాయి. శ్రీరామనవమి శోభాయాత్ర సంద‌ర్భంగా న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో పోలీసులు ఆంక్ష‌లు విధించారు. ఉదయం 11 నుండి రాత్రి 10 గంటల మధ్య కింది మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించబడుతుంద‌ని పోలీసులు పేర్కొన్నారు. శ్రీరామ నవమి శోభ యాత్ర ఉదయం 11 గంటలకు సీతారాంబాగ్ ఆలయం, మంగళ్‌హాట్ నుండి ప్రారంభమవుతుంది. భోయిగూడ కమాన్, మంగళ్‌హాట్ పిఎస్ రోడ్, జాలి హనుమాన్, ధూల్‌పేట్, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడీబజార్, బేగంబజార్, బేగంబజార్ మీదుగా హనుమాన్ వ్యాయంశాల స్కూల్, సుల్తాన్ బజార్ వరకు.. ఇటు సిద్దియాంబర్ బజార్ మసీదు, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ చమన్, గురుద్వారా, పుత్లిబౌలి కూడలి, ఆంధ్రా బ్యాంక్, కోటి మరియు హనుమాన్ వ్యాయంశాల, సుల్తాన్ బజార్ వ‌ర‌కు ఊరేగింపు సాగుతుంది. మ‌రో ఊరేగింపు ఆకాశపురి హనుమాన్ ఆలయం నుండి ప్రారంభమవుతుంది. గంగాబౌలి జంక్షన్ వద్ద ప్రధాన ఊరేగింపులతో ఈ శోభాయాత్ర క‌లుస్తుంది. ఊరేగింపు సమయంలో మార్గంలో పేర్కొన్న ప్రాంతాలకు ఊరేగింపు చేరుకునేటప్పుడు ట్రాఫిక్ నిలిపివేయబడుతుందని పోలీసులు తెలిపారు. న‌గ‌ర ప్రజలు గమనించి తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.