మేదావుల మౌనం ప్రమాదకరం అని అంటారు. మేదావులు మౌనంగా ఉంటే ప్రజలకు న్యాయం జరగదనీ, అసమర్థులు రాజ్యమేలుతారని సామాన్య ప్రజల వాదన. అయితే అదే రాజకీయ నాయకులు మౌనంగా ఉంటే ఏమనాలి? కచ్చితంగా ఏదో వ్యూహమో.. మరేదో పొలిటికల్ గేమ్ అని కచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకని అంటారా? అదేనండీ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురించి. తెలంగాణలో ఏదైనా అనుహ్య పరిణామాలు మొదలైనప్పుడు, రాజకీయాలు రసవత్తరంగా మారినప్పుడు జగ్గారెడ్డి కచ్చితంగా స్పందిస్తుంటారు. అదీ ఆయన నైజం కూడా. మరి అలాంటి జగ్గారెడ్డి తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతుంటే ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ లో ఏదైనా విభేధాలు తలెత్తినప్పుడు జగ్గారెడ్డి కచ్చితంగా స్పందించే వ్యక్తి. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్, కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యల పట్ల ఏమాత్రం నోరుమెదపడం లేదు. ఇదీ కచ్చితంగా ఆయన వ్యూహమేనని అని అంటున్నారు ఆయన వర్గీయులు
నెలరోజులు గా గాంధీ భవన్ కు దూరం
జగ్గారెడ్డి సంగారెడ్డి తన నియోజకవర్గ రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో సైతం చురుగ్గా ఉంటారు. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా గాంధీ భవన్ మొహం చూడటం లేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. నెలరోజులుగా ఆయన గాంధీ భవన్ వైపు వచ్చిన సందర్భాలు లేనే లేవట. తన నియోజకవర్గమైన సంగారెడ్డికి మాత్రమే పరిమితమయ్యారని తెలుస్తోంది. వరుసగా ప్రెస్ మీట్స్ పెట్టి సంచనాలకు కేంద్ర బిందువుగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా సైలంట్ ఉండటం అటు కాంగ్రెస్, ఇటు ఇతర పార్టీల్లోనూ ఆసక్తిని రేపుతోంది.
మౌనం వీడేనా
వ్యూహంలో భాగంగానే జగ్గారెడ్డి మౌనంగా ఉంటున్నారని సమాచారం. ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితులపై ఆయన గమనిస్తున్నప్పటికీ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. అయితే ఇప్పుడున్న పరిస్తితులు కాంగ్రెస్ లో సమసిపోతే మళ్లీ గాంధీ భవన్ కు వస్తారని, లేదేంటే కొన్నాళ్ల పాటు సైలంట్ ఉంటారని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. అయితే జగ్గారెడ్డి మౌనం వెనుక ఆయన కొత్త పార్టీ ఆలోచన ఉన్నట్టు కూడా మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాంగ్రెస్ లో పరిస్తితులు చక్కబడకపోతే కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం కూడా. జగ్గారెడ్డి కొత్త పార్టీ పెడుతారా? లేక కొన్నాళ్ల తర్వాత కాంగ్రెస్ లో యాక్టివ్ ఉంటారా? అనేది చర్చనీయాంశమవుతోంది. దసరా తర్వాత జగ్గారెడ్డి ఏదో ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని జగ్గారెడ్డి అనుచరులు పేర్కొంటున్నారు. మొత్తానికి జగ్గారెడ్డి వ్యవహరం టీకాంగ్రెస్ లో ఆసక్తిని రేపుతోంది.