Revanth Reddy: అగ్నిపథ్ పై ‘టీకాంగ్రెస్’ పోరు!

ఏఐసీసీ పిలుపు మేరకు మోదీ ప్రభుత్వం తెచ్చిన అగ్నిఫథ్ కు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా టీపీసీసీ అధ్వర్యంలో  సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు.

  • Written By:
  • Updated On - June 27, 2022 / 05:28 PM IST

ఏఐసీసీ పిలుపు మేరకు మోదీ ప్రభుత్వం తెచ్చిన అగ్నిఫథ్ కు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా టీపీసీసీ అధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. అందులో భాగంగా మాల్కాజిగిరి చౌరస్తాలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద సత్యగ్రహ దీక్షలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియానుద్దేశించి మాట్లాడారు. దేశ సరిహద్దులో సైన్యం ప్రాణాలు తెగించి పోరాటం చేస్తుంది కాబట్టే దేశ ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారని, అందుకే జై జవాన్, జై కిసాన్ నినాదం తో కాంగ్రెస్ పనిచేసింది రేవంత్ రెడ్డి అన్నారు. అదానీ, అంబానీల కోసమే అగ్నిపథ్ తీసుకొచ్చింది అని, 15 ఏళ్ళు జవానుగా పని చేసిన వాళ్లకు బదులుగా 4 ఏళ్ళు చేయడం ఏంటీ అని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం ఇజ్రాయిల్ దేశ విధానం ఫాలో అవుతున్నామని చెప్పడం సిగ్గుచేటు అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి జనాభా లేని దేశంతో భారత్ ను పోల్చడం దారుణమని. చదువు లేని సన్నాసి మోడీ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిరుపేద కుటుంబ పిల్లలే ఆర్మీ వైపు వస్తున్నారని, రెండేళ్ల క్రితం దేహదారుఢ్య పరీక్షల్లో పాస్ అయ్యారని, రాత పరీక్ష పెట్టకుండా రద్దుచేయడం వల్లే సికింద్రాబాద్ ఘటన జరిగిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాకేష్ శవయాత్రను టీఆరెస్ నేతలు రాజకీయ యాత్రగా మార్చారని, ఆర్మీ అభ్యర్థులపై రైల్వే కేసులతోపాటు, స్టేట్ పోలీసులు కూడా హత్యయత్నం కేసులు పెట్టారని మండిపడ్డారు. మోడీ, కేసీఆర్ లను పాతాళంలోకి తొక్కాలని, కేసీఆర్ నువ్వు నీ కొడుకు తప్పు చేయడం లేదా ? ఆ పిల్లలను క్షమించే ఆలోచనలేదా? అని ప్రశ్నించారు.  స్పెషల్ కోర్టు ద్వారా అసలు దోషులను శిక్షించి అమాయకులను వదిలేయాలని, ఇలా అన్ని అంశాలపై మా నేతలు మోడీని నిలదీసే ప్రయత్నం చేస్తే.. సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇస్తున్నారని, హైదరాబాద్ కు మోడీ వస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్ అగ్నిపథ్ పై నిరసన వ్యక్తం చేయాలని ఈ సందర్భంగా  రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.