Site icon HashtagU Telugu

Producer Dil Raju: దిల్ రాజుకు వారసుడొచ్చాడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని!

Dil Raju

Dil Raju

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు మరోసారి తండ్రయ్యారు. మొదటి భార్య చనిపోయిన తరువాత ఆయన వరంగల్ కు చెందిన తేజస్వినిని రెండో వివాహం చేసుకున్నారు. 2020లో వీరి పెళ్లి కుటుంబ సభ్యుల మధ్య వైభవంగా జరిగింది. ఇప్పుడు తేజస్విని మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు.. ముఖ్యంగా పలువురు సినీ ప్రముఖులు దిల్ రాజు భార్యభర్తలకు శుభాకాంక్షలు పెద్ద ఎత్తున తెలుపుతున్నారు. తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. దిల్ రాజ్ భార్య అనిత అనారోగ్యంతో బాధపడుతూ 2017లో మృతి చెందారు. ఈ దంపతులకు హన్సితా రెడ్డి అనే కుమార్తె ఉంది. భార్య మరణం తరువాత ఆయన మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఆయన రెండో వివాహం చేసుకోవాల్సిందిగా హన్సితారెడ్డి కోరింది. తొలుత దీనికి దిల్ రాజు అంగీకరించకపోయినా.. చివరకు కూతురి కోరికను మన్నించి.. తేజస్వినిని రెండో వివాహం చేసుకున్నారు.

తెలుగుచలనచిత్ర పరిశ్రమలో అత్యంత వేగంగా ఎదిగిన నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. తెలంగాణకు చెందిన ఈ బడా ప్రొడ్యూసర్.. చాలా సినిమాలను నిర్మించడంతోపాటు వాటిని పంపిణీ చేస్తుంటారు. దీనివల్ల ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో సీనీ మార్కెట్ పై పట్టుంది. చాలా థియేటర్లపై కమాండ్ కూడా ఉంది. అందుకే చిన్న నిర్మాతలు సినిమాలను నిర్మించినా.. దిల్ రాజు ను డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా కోరుతుంటారు. అలా ఆయన చేతులమీదుగా వచ్చిన చిత్రాలు విజయవంతమవ్వడంతో ఇక ఆయన వెనుదిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆయన తీసిన దిల్ సినిమా హిట్టవ్వడంతో ఆయన పేరుకు ముందు దిల్ వచ్చి చేరింది. అలా ఆయన దిల్ రాజు అయ్యారు. ఇప్పుడు వారసుడు రావడంతో దిల్ రాజు ఆనందానికి పట్టాపగ్గాలేవంటున్నారు ఆయన సన్నిహితులు.