తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యల పై టాలీవుడ్ ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఈరోజు కలవనున్నారు. ఏపీలోని తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీస్‌లో, ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుందని తెలుస్తోంది. టాలీవుడ్ నుంచి చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు సహా పలువురు హీరోలు, అలాగే పలువురు దర్శకులు, నిర్మాతలు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ప్రభుత్వం నుండి మంత్రి పేర్ని నానితో సహా ఉన్నతాధికారులు ఈసమావేశంలో పాల్గొననున్నారు.
ఇక ఈ సమావేశంలో భాగంగా నిర్మాతలు నష్టపోకుండా టికెట్ల ధరలు పెంచాలని సీఎం జగన్‌ను సినీ పరిశ్రమ ప్రముఖులు కోరనున్నారు. ఇటీవల జగన్ సర్కార్ ఏపీలో మూవీ టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ 35వ నెంబరు జీవోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ప్రభుత్వం కూడా టిక్కెట్ల ధరల నిర్ణయానికి సంబంధించి కమిటీని నియమించగా, కమిటీ కూడా టిక్కెట్ల ధరలను పెంచాలని అభిప్రాయపడినట్లు సమాచారం. ఈరోజు సీఎం జగన్‌తో జరిగే సమావేశంలో ఈ కమిటీ ఇచ్చిన నివేదికను బయటపెట్టే అవకాశం ఉంది. ఇక హైకోర్టులో కూడా సినిమా టిక్కెట్ల వివాదం పై విచారణ జరగనున్న నేపథ్యంలో, జగన్‌తో ఈరోజు సినీ ప్రముఖల సమావేశం కీలకంగా మారనుంది.
