Site icon HashtagU Telugu

Article 370 Abrogation : మూడేళ్ల 11 నెలల తర్వాత.. ఆర్టికల్ 370 రద్దు సవాల్ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు విచారణ

Supreme Court

Article 370 Abrogation : జమ్మూ కాశ్మీర్‌ కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019 ఆగస్టు 5న తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్ధించుకుంది. అది ముమ్మాటికీ సరైన నిర్ణయమే అని పేర్కొంటూ సుప్రీంకోర్టుకు నిన్న(సోమవారం)  20 పేజీల అఫిడవిట్‌ ను సమర్పించింది. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ(Article 370 Abrogation) 2019, 2020 సంవత్సరాల్లో దాఖలైన 20కిపైగా పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈరోజు (జులై 11న) విచారణ నిర్వహించి, విచారణ షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది. దీనికి సరిగ్గా ఒకరోజు ముందు(సోమవారం)  సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఈ అఫిడవిట్‌ ను సమర్పించడం గమనార్హం. “ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ అభివృద్ధి మొదలైంది. శాంతి చిగురించింది. రాళ్లదాడులు, ఉగ్రదాడులు ఒక గతంలా మిగిలిపోయాయి. ఇప్పుడు కాశ్మీర్ లో వాటి ఊసే లేదు” అని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. రిజర్వేషన్ల అమలు, సంక్షేమ పథకాల అమలు, దేశ భాషలకు గుర్తింపు వంటివన్నీ ఇప్పుడు కాశ్మీర్ లోనూ జరుగుతున్నాయని పేర్కొంది.

Also read : Nurse : పేషంట్‌తో సెక్స్ చేసి అతని మరణానికి కారణమైన నర్స్.. హాస్పిటల్ యాజమాన్యం ఏం చేసిందో తెలుసా?

2019లో దాఖలైన పిటిషన్ల బ్యాచ్.. 

ఆర్టికల్ 370 రద్దును సవాల్  చేస్తూ 2019లో దాఖలైన పిటిషన్ల బ్యాచ్ ను  ఆ ఏడాది డిసెంబర్‌లో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేశారు.  అయితే ఈ పిటిషన్ల లిస్టింగ్‌పై “కాల్ తీసుకుంటాను” అని తాజాగా 2023 ఫిబ్రవరిలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ఇందులో భాగంగా మూడేళ్ళ  11 నెలల తర్వాత ఈరోజు ఆ పిటిషన్లపై విచారణ  జరగబోతోంది.

పిటిషనర్లు ఎవరు ?

పిటిషనర్లలో అనేక మంది న్యాయవాదులు, కార్యకర్తలు, రాజకీయ నాయకులు, రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు ఉన్నారు. పిటిషనర్లలో న్యాయవాది ఎంఎల్ శర్మ, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన న్యాయవాది షకీర్ షబీర్, నేషనల్ కాన్ఫరెన్స్ లోక్‌సభ ఎంపీలు మహ్మద్ అక్బర్ లోన్, జస్టిస్ (రిటైర్డ్) హస్నైన్ మసూది, షెహ్లా రషీద్,  కాశ్మీర్ కోసం కేంద్ర  హోం శాఖ యొక్క గ్రూప్ ఆఫ్ ఇంటర్‌ లొక్యూటర్స్ మాజీ సభ్యుడు రాధా కుమార్, కాశ్మీర్ మాజీ చీఫ్ సెక్రటరీ హిందాల్ హైదర్ త్యాబ్జీ, రిటైర్డ్ ఎయిర్ వైస్ మార్షల్ కపిల్ కాక్, రిటైర్డ్ మేజర్ జనరల్ అశోక్ కుమార్ మెహతా, అమితాభా పాండే, మాజీ కేంద్ర హోం కార్యదర్శి గోపాల్ పిళ్లై తదితరులు ఉన్నారు.