NCP vs NCP : శరద్ పవార్ ఎన్‌సీపీ రెండు ముక్కలు ? 54 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది అజిత్ వెంటే ?

NCP vs NCP : కొన్ని నెలల క్రితం శివసేన రెండు ముక్కలయింది.. ఇప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) వంతు వచ్చినట్టుగా కనిపిస్తోంది.. ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను చూస్తే  అదే జరుగుతుందేమోనని అనిపిస్తోంది.  

  • Written By:
  • Updated On - July 3, 2023 / 12:29 PM IST

NCP vs NCP : కొన్ని నెలల క్రితం శివసేన రెండు ముక్కలయింది.. 

ఇప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) వంతు వచ్చినట్టుగా కనిపిస్తోంది.. 

ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను చూస్తే  అదే జరుగుతుందేమోనని అనిపిస్తోంది.  

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు అజిత్ పవార్ 30 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ పై తిరుగుబాటు చేశారు. మొత్తం 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం రాజ్ భవన్ కు వెళ్లి  మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న అజిత్ పవార్‌ తిరుగుబాటు వార్తలు కలకలం రేపాయి. డిప్యూటీ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారనే న్యూస్ సెన్సేషన్ సృష్టించింది.

సరిగ్గా ఏడాది క్రితం ఇలాంటి సీన్ నే మహారాష్ట్ర చూసింది. ప్రస్తుతం మహారాష్ట్ర సీఎంగా ఉన్న ఏక్ నాథ్ షిండే 40 మంది శివసేన ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీతో కూడిన మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే  ప్రమాణం చేశారు.. ఇది  జరిగిన సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏక్ నాథ్ షిండే స్టైల్ లోనే శరద్ పవార్ పై అజిత్ పవార్ తిరగబడ్డారు.  

అజిత్ పవార్ బలగం ఇదీ.. 

మహారాష్ట్రలో ఎన్‌సీపీకి  మొత్తం 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 30 మంది అజిత్ పవార్‌తో కలిసి బీజేపీ కూటమిలోకి జంప్ అయ్యారు. అయితే పార్టీ  ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలను తప్పించుకోవాలంటే..  అజిత్ పవార్‌కు 36 మందికి పైగా ఎన్‌సీపీ ఎమ్మెల్యేల (మూడింట రెండు వంతుల మంది)  మద్దతు అవసరం. త్వరలో మరో 10 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు కూడా అజిత్ పవార్‌ వెనుక వెళ్లే ఛాన్స్ ఉందని ఓ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. అదే  జరిగితే మూడింట రెండు వంతుల మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు లభించిన నేతగా  ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలు అజిత్ పవార్‌ తిరుగుబాటుకు(NCP vs NCP) వర్తించవు. అంతేకాదు ఈ తిరుగుబాటు దెబ్బకు ఎన్సీపీ  చీలిపోయే అవకాశం ఉంది. శరద్ పవార్ పార్టీ చీఫ్ పదవికి కొన్ని రోజులు రాజీనామా చేసిన ఒక నెల తర్వాత ఈ సంక్షోభం చోటుచేసుకోవడం గమనార్హం.మహారాష్ట్ర కేబినెట్‌లో ఇప్పుడు బీజేపీ నుంచి  9 మంది మంత్రులు, శివసేన నుంచి 9 మంది, ఎన్సీపీ నుంచి 9 మంది మంత్రులు, ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. కేబినెట్‌లో గరిష్టంగా 43 మంది సభ్యులు ఉండొచ్చు.

Also read : Ajit Pawar: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్.. ఎన్సీపీ నేత తిరుగుబాటుకు కారణమేంటి..?

ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెబుతోంది ? 

రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో ఫిరాయింపుల నిరోధక చట్టం ఉంది. శాసనసభ్యులు తమ రాజకీయ పార్టీల నుంచి ఫిరాయించకుండా నిరోధించడానికి ఈ షెడ్యూల్ ను  1985లో ప్రవేశపెట్టారు. తమ పార్టీని స్వచ్ఛందంగా వదిలివేయడం లేదా పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా పార్టీ ఫిరాయించిన పార్లమెంటేరియన్లు లేదా శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించే ప్రక్రియను ఈ షెడ్యూల్ వివరిస్తుంది.

ఫిరాయింపుల నిరోధక చట్టం ఎప్పుడు వర్తించదు?

ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. ఒక శాసనసభ్యుడు ఓటింగ్‌కు దూరంగా ఉన్నా.. ఏదైనా సమస్యపై పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినా వారి స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ చట్టం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు రెండింటికీ వర్తిస్తుంది. ఈ చట్టం రెండు మినహాయింపులను అందిస్తుంది. అవేమిటంటే.. కొంతమంది ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు    ఒక సమూహంగా ఏర్పడితే ఈ పరిణామాలను ఎదుర్కోకుండానే ఓటింగ్‌కు గైర్హాజరు కావచ్చు. ఒక రాజకీయ పార్టీకి చెందిన శాసనసభ్యులలో మూడింట ఒక వంతు మంది దాని నుంచి రాజీనామా చేస్తే లేదా మూడింట రెండు వంతుల మంది శాసనసభ్యులు మరొక పార్టీలో విలీనమైతే దాన్ని ఫిరాయింపుగా పరిగణించరు.

Also read : Mira Kulkarni: కొవ్వొత్తుల తయారీ.. కోట్లు సంపాదిస్తున్న మహిళ.. సక్సెస్ స్టోరీ తెలిస్తే వావ్ అనాల్సిందే?

శరద్ పవార్ కు తెలిసే జరిగిందా ?

మహారాష్ట్ర రాజ్ భవన్ లో ఆదివారం జరిగిన అజిత్ పవార్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎన్సీపీ ముఖ్య నేతల్లో ప్రఫుల్ పటేల్ కూడా ఉన్నారు. ఇటీవల ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ను ప్రఫుల్ పటేల్ కు శరద్ పవార్ కేటాయించారు. ఎన్సీపీలో కీలక పదవిలో ఉన్న శరద్ పవార్ నమ్మిన బంటు ప్రఫుల్ పటేల్ .. అజిత్ పవార్ తో కలిసి రాజ్ భవన్ కు రావడాన్ని బట్టి ఇదంతా శరద్ పవార్ కనుసన్నల్లోనే జరిగిందా ? అనే అనుమానాలకు తావిస్తోందని మీడియాలో కథనాలు వచ్చాయి. నెల కిందట మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేతో శరద్ పవార్ భేటీ అయింది ఇందుకోసమేనా అనే చర్చ కూడా నడుస్తోంది.

శివసేన లాగే ఎన్సీపీ చీలుతుందా ?

ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండే 2022 జూన్ 21న శివసేన చీఫ్, నాటి సీఎం ఉద్ధవ్ థాక్రే పై తిరుగుబాటును ప్రారంభించారు. డజన్ల కొద్దీ శివసేన ఎమ్మెల్యేలను గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్‌ కు తీసుకెళ్లారు. తనకు దాదాపు 38 మంది శివసేన ఎమ్మెల్యేల (మూడింట రెండు వంతుల మంది) మద్దతు ఉందని గవర్నర్ కు ఏక్ నాథ్ తెలిపారు. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలతో కూడిన నాటి సర్కారు మెజారిటీ కోల్పోయింది. ఈ తరుణంలో బీజేపీతో ఏక్ నాథ్ చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు. తనదే అసలైన శివసేన పార్టీ అని ఏక్ నాథ్ షిండే క్లెయిమ్ చేసుకున్నారు. అయితే ఆ తర్వాత శివసేన (ఏక్ నాథ్), శివసేన (ఉద్ధవ్) రెండు ముక్కలుగా శివసేన చీలిపోయింది. ఇప్పుడు ఎన్సీపీ కూడా ఇలాగే.. అజిత్ పవార్, శరద్ పవార్ వర్గాలుగా చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.