Updated :
తిరుపతి తొక్కిసలాట ఘటనలో మరణాల సంఖ్య భారీగా పెరుగుతుంది. మొదట నలుగురు మాత్రమే మరణించారని అనుకున్నారు. కానీ ఆ తర్వాత మృతుల సంఖ్య పెరగడం మొదలైంది. ప్రస్తుతం ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. రుయా ఆస్పత్రిలో నలుగురు, స్విమ్స్ ఇద్దరు మృతి చెందారు. గాయపడినవారికి స్థానిక రుయా ఆసుపత్రిలో ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స అందిస్తున్నారు.
బుధవారం రాత్రి తిరుపతిలో మూడు ప్రధాన ప్రాంతాల్లో టోకెన్ల కోసం భక్తులు గుమిగూడారు. శ్రీనివాసం, బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్, సత్యనారాయణపురం టోకెన్ జారీ కేంద్రాల్లో ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన సేలం మహిళ ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు భక్తులు మృతిచెందినట్లు సమాచారం. అలాగే పలువురు తీవ్ర స్థాయిలో గాయపడ్డారు. వీరిలో కొంతమంది ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ ఘటన పై సీఎం చంద్రబాబు (CM Chandrababu) దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అటు టీటీడీ, జిల్లా అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని సీఎం తెలుసుకుంటున్నారు. ఇక మంత్రి లోకేశ్ సైతం ఇలాంటి ఘటనలు జరగకుండా టీటీడీ మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
టికెట్ కౌంటర్ల ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి బందోబస్తు లేకుండా భక్తులను ఒకేసారి క్యూలైన్లలోకి వదలడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు వారు వాపోతున్నారు. పాలన వ్యవస్థ నిర్వహణ లోపంతో పాటు పోలీసులే దీనికి కారణమని మండిపడుతున్నారు. వాస్తవానికి రేపు ఉ.5 గంటలకు టోకెన్లు ఇస్తామని ప్రకటించిన టీటీడీ తన నిర్ణయాన్ని మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Abhishek Sharma: అభిషేక్ శర్మపై వేటు.. ఇంగ్లాండ్ సిరీస్ కు కష్టమే!