జనవరి 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుస్తున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. ఒమైక్రాన్ వైరస్ ప్రభులుతున్న నేపథ్యంలో శ్రీవారి దర్శన కోటాను పెంచడం లేదని, తిరుమలకు వచ్చే భక్తులు తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. వ్యాక్సినేషన్, లేదా ఆర్టీపీసీఆర్ సర్టిఫికెట్ లేని భక్తులను ఎట్టి పరిస్థితుల్లో తిరుమలకు అనుమతించమని స్పష్టం చేశారు. వైకుంఠ ద్వారా దర్శనం కోసం జవవరి 12వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 5వేలు చొప్పున 50వేల సర్వదర్శనం టోకెన్లను తిరుపతి వాసులకు జారీ చేస్తామని ధర్మారెడ్డి తెలిపారు. ఇతర ప్రాంతాల భక్తులకు సర్వ దర్శనం టోకెన్లను జారీ చేయమని చెప్పారు. వైకుంఠ ద్వారా దర్శనం కోసం ఇవాళ శ్రీవాణి ట్రస్టు టిక్కెట్లను భక్తులకు విడుదల చేస్తున్నామని.. 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సిపారస్సులపై దర్శనం కేటాయించమని తెలిపారు. ప్రముఖులు స్వయంగా తిరుమలకు వస్తేనే బ్రేక్ దర్శనం కల్పిస్తామని స్పష్టం చేశారు. తిరుమలలో వసతి సదుపాయం సమస్య వుందని, భక్తులు ఇతర ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా ఘాట్ రోడ్డులో రౌండ్ ది క్లాక్ భక్తులను అనుమతిస్తామని, భక్తులు తిరుపతి నుంచే వచ్చి శ్రీవారి దర్శనం చేసుకోవాలన్నారు. జనవరి 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ ఉదయం వరకు భక్తులకు తిరుమలలో గదులు కేటాయించబోమని తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉదయం 9.00గంటలకు స్వర్ణ రధోత్సవ సేవను నిర్వహిస్తామని, ద్వాదశినాడు ఉదయం 5.00గంటలకు చక్రస్నానం నిర్వహిస్తామని ధర్మారెడ్డి స్పష్టం చేశారు.
Tirumala : ఆ పదిరోజుల పాటూ శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం.. !
