Site icon HashtagU Telugu

Vizianagaram : అదిగో అదే పులి

ఏపీలో మ‌ళ్లీ పులి సంచారం బ‌య‌ట‌ప‌డింది. నాలుగు నెల‌లుగా ముప్పుతిప్పలు పెడుతోన్న టైగ‌ర్ తాజాగా సీసీ కెమెరాల‌కు దొరికింది. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం పులిగొమ్మి గ్రామ శివారులో పులి తిరుగుతోంది. అక్క‌డ ఏర్పాటు చేసిన కెమెరాల‌కు పులి చిక్కింది. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం పులిగొమ్మి గ్రామ శివారులోని తోటలో ఆవు మృతి చెందినట్లు నాలుగు రోజుల క్రితం అటవీశాఖ అధికారులు గుర్తించారు. చ‌నిపోయిన ఆవు వద్ద నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు తిన‌గా మిగిలిన ఆవు భాగాల‌ను తీసుకెళ్లేందుకు సోమవారం రాత్రి పులి ఆ ప్రాంతానికి వస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

సీసీ కెమెరాలోని చిత్రాలను విశ్లేషణ నిమిత్తం గుంటూరులోని వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్‌కు పంపినట్లు జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌ఓ) శంబంగి వెంకటేష్ తెలిపారు. ప్రాథమిక పరీక్ష ప్రకారం అది మగ పులి. నాలుగు నెలల క్రితం కాకినాడ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల కనిపించిన పులి అదేనని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి అటవీ రేంజ్ పరిధిలోని బొబ్బిలి-బాడంగి మండల సరిహద్దులోని హరిజన్ పాల్తేరు గ్రామ సమీపంలో బుధవారం అర్ధరాత్రి మరో ఆవుపై పులి దాడి చేసింది. గురువారం ఉదయం ఆవు మృతదేహాన్ని గుర్తించిన రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పులి పాదముద్రలను గుర్తించిన అటవీశాఖ అధికారులు ఆ పాదముద్రల ఆధారంగా బొబ్బిలి మండలంలోని అలజంగి, పిరిడి గ్రామాల వైపు ఉత్తరానికి వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు.