Shane Watson: ముంబై తప్పిదాలు ఇవే : వాట్సన్

ఐపీఎల్‌ 2022 సీజన్‌ ముంబై ఇండియన్స్‌కు ఏమాత్రం కలిసి రావట్లేదు.

  • Written By:
  • Publish Date - April 16, 2022 / 05:38 PM IST

ఐపీఎల్‌ 2022 సీజన్‌ ముంబై ఇండియన్స్‌కు ఏమాత్రం కలిసి రావట్లేదు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇక ముంబై ఇండియన్స్ తదుపరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో శనివారం తలపడనుంది. అయితే ఐపీఎల్‌-2022 మెగా వేలంలో ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ ప్రణాళికా బద్దంగా వ్యవహరించకపోవడం వల్లే పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిందని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు.

తాజాగా ముంబై ఇండియన్స్‌ జట్టు ప్రదర్శనపై షేన్ వాట్సన్ మాట్లాడుతూ ఐపీఎల్ 15వ సీజన్ పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ చివరి స్థానంలో ఉండటం నన్నేం ఆశ్చర్యపర్చలేదు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ మెగా వేలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదు. ముఖ్యంగా మెగా వేలంలో కిషన్‌ను రూ.15.25 కోట్లు వెచ్చించడం, అలాగే ఈ సీజన్‌కు జోఫ్రా ఆర్చర్‌ అందుబాటులో లేనప్పటికీ రూ.8 కోట్లు చెల్లించి కొనుగోలు చేయడం వంటి నిర్ణయాలు నన్ను షాక్ కు గురిచేశాయి. ఇషాన్ కిషన్‌ టీ 20 స్పెషలిస్ట్ అయినప్పటికీ అతడి కోసమే అంత మొత్తం వెచ్చించడం సరైంది కాదు. అలాగే చాలా కాలంగా గాయంతో సతమతమవుతూ జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న జోఫ్రా ఆర్చర్ పై కూడా భారీ మొత్తం వెచ్చించారు. ఈ రెండు నిర్ణయాలే ముంబై ఇండియన్స్ కొంప ముంచాయి అని షేన్ వాట్సన్ చెప్పుకొచ్చాడు.