Credit Card Tips: క్రెడిట్ కార్డు ఉందా..? అయితే ఈ విష‌యాల‌పై ఓ లుక్కేయండి!

క్రెడిట్ కార్డును వినియోగించేవారు డబ్బులను కాస్త అధికంగానే ఖర్చు పెడతారని వివిధ సర్వేలు చెబుతున్నాయి.

  • Written By:
  • Publish Date - October 9, 2022 / 11:58 AM IST

క్రెడిట్ కార్డును వినియోగించేవారు డబ్బులను కాస్త అధికంగానే ఖర్చు పెడతారని వివిధ సర్వేలు చెబుతున్నాయి. సాధారణంగా చేతి నుండి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కాస్త ఆలోచిస్తారు. కానీ క్రెడిట్ కార్డు ఉంటే సాధారణం కంటే అధిక ఖర్చు అవుతుంది. క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే ఎంత సౌలభ్యమో ఈ బిల్లును సకాలంలో చెల్లించకుంటే, అలాగే, ఇష్టారీతిన ఖర్చు చేస్తే అంతే ఇబ్బందికరం. గడువులోగా క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించకుంటే ఇది క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం చూపుతుంది. బిల్లు మొత్తాన్ని ఈఎంఐ కింద మార్చినా వడ్డీ కట్టవలసి ఉంటుంది. ఇలా క్రెడిట్ కార్డు వాడకం విషయంలో క్రమశిక్షణ లేకపోతే అప్పుల కుప్ప అవుతుంది.

డబ్బులు ఉండేలా చూసుకోవాలి!

క్రెడిట్ కార్డు బిల్లు సైకిల్ లోగా మీ బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు ఉండేలా చూసుకోవాలి. వాటిని చెల్లించే అంశంపై అవగాహన కలిగి ఉండాలి. మీ ఆదాయం, ఖర్చులు వంటి వాటిని పరిగణలోకి తీసుకొని క్రెడిట్ కార్డు ఖర్చులు ఉండాలి. క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే ఎన్నో ప్రయోజనాలు, రివార్డులు, క్యాష్ బ్యాక్స్ ఉంటాయి. కానీ వాటి కోసం మాత్రమే క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు సరికాదు. క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్ కోసం ఖర్చులు కాకుండా, అవసరమైతేనే ఖర్చు చేయాలి. అది కూడా చెల్లించే సామర్థ్యాన్ని చూసుకోవాలి. క్రెడిట్ స్కోర్ తగ్గితే కనుక అది మెరుగు కావడానికి సమయం తీసుకుంటుంది. కాబట్టి క్రెడిట్ స్కోర్ తగ్గేలా చూడవద్దు.

ఈఎంఐగా మార్చుకోవడం..!

క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేని పరిస్థితి ఉంటే వాటిని ఈఎంఐ రూపంలోకి మార్చుకోవాలి. ఫిక్స్డ్ డిపాజిట్స్, సెక్యూరిటీస్ ఉంటే వాటిపై రుణం కోసం ప్రయత్నాలు చేయవచ్చు. ఈ వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడులు ఉంటే క్రెడిట్ కార్డు బకాయికి సరిపడా యూనిట్లను రీడీమ్ చేయవచ్చు. క్రెడిట్ కార్డు రుణం చెల్లించేందుకు పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. అయితే వడ్డీ ఎక్కువగా ఉంటుంది.

చెల్లించగలిగితేనే..!

క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. ఇది భవిష్యత్తులో మనకు ఆర్థికంగా మేలు చేకూరుస్తుంది. బిల్లులు సక్రమంగా చెల్లించకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. క్రెడిట్ కార్డు ద్వారా షాపింగ్ లేదా ఇతర ఖర్చులు చేస్తున్నప్పుడు ముందే బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం మంచిది. ఖర్చు పెరుగుతుందని భావిస్తే, దీనిని మనం చెల్లించగలమా అనే పునరాలోచన చేయాలి. క్రెడిట్ కార్డు ద్వారా చేసే ప్రతి పైసాను తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా అని బేరీజు వేసుకోవాలి.