Site icon HashtagU Telugu

Turkey: చరిత్ర వెన్నులో వణుకు పుట్టించిన భూకంపాలు ఇవే!

Tc6mo15 Turkey Earthquake 650 625x300 06 February 23

Tc6mo15 Turkey Earthquake 650 625x300 06 February 23

Turkey: భూకంపాలు వస్తే నష్టం ఎంత భారీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రకృతి విపత్తులన్నింటిలో భూకంపం అతి పెద్దగా చెప్పబడుతుండగా.. తాజాగా తుర్కియే, సిరియాలో భారీ భూకంపం సంభవించడంతో ప్రపంచం మరోసారి ఉలిక్కిపడింది. ఒక్కసారిగా ఊహించని విధంగా భూకంపం రావడంతో..జనాలు వణికిపోయారు. భారీ భూకంపం ధాటికి భారీ బిల్డింగులు నేలమట్టం అయ్యాయి. ఇప్పటికే 1600 మంది వరకు మరణించినట్లు అధికారులు చెబుతుండగా.. గడ్డకట్టే చలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

తుర్కియేలో తాజాగా వచ్చిన భూకంపం తీవ్రత 7.8గా రిక్టర్ స్కేల్ మీద నమోదైంది. నిజానికి చరిత్రలో ఇంతకన్నా ఎక్కువ తీవ్రతత వచ్చిన భూకంపాలు ఉండగా.. వాటి వల్ల ఊహించనంత ప్రాణ, ఆస్తి నష్టం వచ్చింది. చరిత్రలో వచ్చిన ఐదు భారీ భూకంపాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. చిలీ, అలస్కా, సుమత్ర దీవులు, జపాన్ దీవులు, రష్యాలో వచ్చిన అతి పెద్ద భూకంపాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

చరిత్రలో ఇప్పటి వరకు వచ్చిన భారీ భూకంపాల్లో చిలీలో వచ్చిన భూకంపాన్ని అతి పెద్ద భూకంపంగా చెప్పుకుంటారు. చిలీలో 1960 మే 22వ తేదీన వచ్చిన భూకంపం ఏకంగా 10నిమిషాల పాటు వచ్చింది. చిలీ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 9.5గా నమోదైంది. ఇప్పటి వరకు నమోదైన భూకంప తీవ్రతల్లో ఇదే ఎక్కువ. దీని తర్వాత అలస్కాలో 1964లో వచ్చిన భూకంపం రెండో అతి పెద్ద భూకంపంగా చెప్పబడుతోంది. 1964లో అలస్కాలో గుడ్ ఫ్రైడే రోజు వచ్చిన భూకంపం తీవ్రత 9.2గా నమోదు కాగా.. 4.38నిమిషాల పాటు భూకంపం వచ్చింది.

2004లో మూడో అతి పెద్ద భూకంపం వచ్చింది. 2004 డిసెంబర్ 26వ తేదీన సుమత్ర దీవుల్లో వచ్చిన భూకంపం అప్పట్లో ప్రపంచాన్ని వణికించింది. సుమత్ర దీవుల్లో అప్పట్లో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 9.1గా నమోదైంది. ఇక 2011లో జపాన్ లోని టొహోలో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్ మీద 9.1గా నమోదైంది. ఆ తర్వాత రష్యాలో కమ్చట్కా ద్వీపకల్పంలో భూకంపం వల్ల ఏకంగా సునామీ వచ్చింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 9గా నమోదైంది.