మొన్నటి వరకు చలితో సతమతమైన ప్రజలు ప్రస్తుతం ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడు ఫిబ్రవరి నెలలోనే భగ్గుమంటున్నాడు. దీంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగుతున్నాయి. వారం క్రితం తీవ్ర చలిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో చలి ప్రభావం ఉన్నప్పటికీ మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతున్నది. రోడ్లపైన జనాలు కనిపించడం లేదు.
గతేడాది కంటే ఈ ఏడాది ఎండలు అధికంగా ఉండడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడు భగభగ మండుతుండడంతో రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి. నిన్న, మొన్నటి వరకు చల్లగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కగా, జనం కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం పగటి ఉష్టోగ్రతలు 30-37 డిగ్రీలకు వరకు నమోదు కాగా, రాత్రి ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు పైగా ఉంటున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎండలు ఎలా ఉంటాయోనని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడే ఎండల తీవ్రత ఇంతస్థాయిలో ఉంటే… మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు ఎండల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలలతో పాటు రోహిణి కార్తె ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తున్నది.