Errolla Srinivas: గ్రూప్స్ అభ్యర్థులు నిరుద్యోగులు నిర్వహించిన ఇందిరా పార్క్ కార్యక్రమానికి బీఆర్ ఎస్ పార్టీ పూర్తి మద్దతు తెలిపింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ… విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు.. విద్యార్థులతో ఆడుకున్న ప్రభుత్వాలు బాగుపడ్డట్టు చరిత్రలో లేదన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు నిరుద్యోగులు గుణపాఠం చెబుతామని, వంద రోజుల్లో చేస్తానన్నా హామీలు అమలు చేసి తీరాల్సిందేనని అన్నారు. గ్రూప్ 1కు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ కు అవకాశం ఇవ్వాలని, గ్రూప్ 2కు 2 ఉద్యోగాలు, గ్రూప్ 3కి 3 వేల ఉద్యోగాలు కలుపుతామన్న మీ మాట నిలబెట్టుకోవాలని ఎర్రోళ్ల అన్నారు.
‘‘పరీక్షకు పరీక్షకు మధ్య 2 నెలల గ్యాప్ ఉండాలి. జూలైలో డీఎస్సీ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 7,8న గ్రూప్ 2 ఉంది. 7 రోజుల గ్యాప్ మాత్రమే ఉండడంతో ఒత్తిడితో సంగీత అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఏడాదిలోగా 2 లక్షలు ఉద్యోగాలిస్తామని, జాబ్ కేలండర్ ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలలైనా జాబ్ కేలండర్ ఎందుకివ్వలేదు? హామీని నిలబెట్టుకోవాలి. 25 వేల పోస్టులతో కాకుండా 11 వేల పోస్టులతో డీఎస్సీ ఎందుకు ప్రకటించారు? మొత్తం 25 వేల పోస్టులతో మా డీఎస్సీ నిర్వహించాలి. ఇచ్చిన హామీలు అన్ని అమలయ్యేదాకా విద్యార్థుల తరఫున బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏడాదిలోపే కాంగ్రెస్ పార్టీ పై అన్ని వర్గాల వ్యతిరేకత వచ్చింది’’ అని ఆయన అన్నారు.