Pocharam: పేదలు అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నారు.. వారి బాధ నేను చూడలేను : ఎమ్మెల్యే పోచారం

  • Written By:
  • Updated On - April 20, 2024 / 11:06 PM IST

Pocharam: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బాన్సువాడ నియోజకవర్గంలోని పోతంగల్, కోటగిరి, రుద్రూరు మండల కేంద్రాలలో ఈరోజు జరిగిన రోడ్ షో, కార్నర్ మీటింగ్ లలో జహీరాబాద్ BRS పార్టీ MP అభ్యర్థి గాలి అనీల్ కుమార్ తో కలిసి పాల్గొన్న మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు.

‘‘BRS ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ళు బాన్సువాడ నియోజకవర్గానికి మాత్రమే మంజూరు అయ్యాయి. అందులో 10,000 ఇళ్ళ నిర్మాణం పూర్తయింది. డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మించుకున్న పేద లబ్ధిదారులకు BRS ప్రభుత్వంలో రూ. 400 కోట్ల బిల్లులు ఇప్పించాను. ప్రభుత్వం మారిన తరువాత పెండింగ్ లో ఉన్న రూ. 26 కోట్ల బిల్లులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మంత్రిని కోరితే ఆయన అంగీకరించారు. తరువాత ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆ మంత్రి దగ్గరకు వెళ్ళి బిల్లులు ఇవ్వొద్దని చెప్పారట. BRS ప్రభుత్వంలో రూ. 400 కోట్ల బిల్లులు ఇప్పించాను. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 30 కోట్ల బిల్లులను ఇవ్వడం లేదు’’ పోచారం మండిపడ్డారు.

‘‘నన్ను నమ్ముకుని పేదలు అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నారు. వారి బాధ నేను చూడలేను. పార్లమెంట్ ఎన్నికల లోపు బిల్లులు రాకపోతే మే 13 ఓటింగ్ తరువాత లబ్ధిదారులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తాను. అయినా ప్రభుత్వం స్పందించక బిల్లులు ఇయ్యకపోతే అమరణ నిరాహారదీక్ష చేస్తాను, అవసరమైతే ప్రాణత్యాగం చేస్తాను. పేదల కోసం నాకు ఇంతకు మించి మరో ప్రత్యామ్నాయం లేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసి ఆశపడి ప్రజలు ఓట్లు వేశారు. కానీ ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదు’’ పోచారం మండిపడ్డారు.

‘‘అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు హామీలు అమలు కాలేదు. రైతుబంధు ఎకరాకు రూ. 15,000, కౌలు రైతులకు ఎకరాకు రూ. 15,000, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000, వరి పంటకు క్వింటాలుకు రూ. 500 బోనస్,18 ఏళ్ళు దాటిన మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇయ్యలేదు. అదేవిధంగా ఆసరా పెన్షన్ రూ. 4000 కు పెంచుతామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4000 ఇస్తామన్నారు. 24 గంటల కరంటు ఇస్తామన్నారు. 200 యూనిట్ల వరకు కరంటు ఫ్రీ అన్నారు, లేదు. రూ. 500 కు గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు. ఎక్కడా లేదు’’ అని పోచారం అన్నారు.