Site icon HashtagU Telugu

Hardik Pandya: హార్థిక్ ఆల్‌రౌండ్ షో కొనసాగాలి ఇలా…

Hardik Pandya

Hardik Pandya

టీ ట్వంటీ ఫార్మేట్‌లో ఆల్‌రౌండర్లే ఏ జట్టుకైనా కీలకం. ఇటు బ్యాటింగ్‌లోనూ, అటు బౌలింగ్‌లోనూ రాణించే వారికే ప్రాధాన్యత ఉంటుంది. మిగిలిన జట్లతో పోలిస్తే భారత్‌కు నిలకడగా రాణించే ఆల్‌రౌండర్లు తక్కువగా ఉంటున్నారు. వారిలో గాయాలు, నిలకడలేమి , ఫిట్‌నెస్ సమస్యలతో జట్టుకు దూరమవుతున్నారు. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న హార్థిక్ పాండ్యా మళ్ళీ మునుపటి ఫామ్ అందుకున్నట్టే కనిపిస్తున్నాడు.

ఐపీఎల్ 15వ సీజన్‌తో ఆల్‌రౌండర్‌గా హార్థిక్ పాండ్యా గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ ముగిసినట్టేనన్న విమర్శలు చుట్టుముట్టిన వేళ గుజరాత్ జట్టును ఛాంపియన్‌గా నిలిపిన పాండ్యా ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. భారత జట్టులో పునరాగమనం చేసి కెప్టెన్‌గా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ గెలిచాడు. తాజాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్‌ను విజయతీరాలకు చేర్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ ట్వంటీలో పాండ్యా పూర్తి ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బ్యాట్‌తో సత్తా చాటిన పాండ్యా చివర్లో ధాటిగా ఆడి జట్టుకు భారీస్కోర్ అందించాడు. కేవలం 33 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 51 పరుగులు చేశాడు. దీంతో భారత్ 198 పరుగుల స్కోర్ సాధించింది.

ఐపీఎల్‌లోనూ పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన పాండ్యా ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుపైనా ఫామ్ కొనసాగించడం జట్టుకు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. అనంతరం బంతితోనూ రాణించిన పాండ్యా 4 కీలక వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఈ క్రమంలో పాండ్యా అరుదైన రికార్డు అందుకున్నాడు. ఒక టీ ట్వంటీ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో పాటు మూడు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డలకెక్కాడు. మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తర్వాత హార్దిక్‌ ఈ ఘనత సాధించాడు. 2009-10లో మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో యువీ ఇలాంటి ప్రదర్శన నమోదు చేశాడు. కాగా ఇంగ్లాండ్‌తో తొలి టీ ట్వంటీలో ప్రదర్శన తర్వాత టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు హార్థిక్ కీలకం కానున్నాడని అభిప్రాయపడుతున్నారు.