Lady Doctor: లవ్ కోసం గూగుల్ సెర్చ్.. మోసపోయిన లేడీ డాక్టర్!

కంటి వైద్యురాలు నైజీరియన్ బ్యాచ్ చేతిలో మోసపోయింది.

  • Written By:
  • Updated On - January 12, 2023 / 05:33 PM IST

హైదరాబాద్ కుషాయిగూడకు చెందిన ఒక కంటి వైద్యురాలు నైజీరియన్ బ్యాచ్ చేతిలో మోసపోయింది. నైజీరియా కు చెందిన కొందరు బట్టల వ్యాపారం కోసం ఢిల్లీ వచ్చారు. తీరా వ్యాపారంలో భారీగా నష్టపోయారు. దీంతో మోసాలకు సిద్ధపడ్డారు. ప్రేమ సమస్యలు ఉన్న, వ్యాపార సమస్యలు ఉన్న, కుటుంబ సమస్యలు ఉన్న తాము పరిష్కరిస్తామంటూ ఆన్‌లైన్‌లో ఫోన్ నంబర్లు ఉంచారు. హైదరాబాద్ కుషాయిగూడ కు చెందిన ఒక కంటి వైద్యురాలు ప్రేమ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. గూగుల్ లో జ్యోతిష్యుల కోసం ఆ వైద్యురాలు అన్వేషించగా.. ఈ నైజీరియన్ బ్యాచ్ నంబర్ కంటపడింది. దాంతో వైద్యురాలు వారికి ఫోన్ చేసింది. మీ సమస్య చాలా చిన్నది తాము ప్రార్థనలు, పూజలు చేసి పరిష్కరిస్తామంటూ తొలుత లక్ష రూపాయలు తీసుకున్నారు.

అయితే యాదృచ్చికంగా తన ప్రియుడు తనకు దగ్గర కావడంతో ఈ నైజీరియన్ బ్యాచ్ పై కంటి వైద్యురాలు మరింత నమ్మకాన్ని పెంచుకుంది. తాను సొంతంగా ఒక క్లినిక్ పెట్టాలనుకుంటున్నానని వ్యాపారం సజావుగా సాగేందుకు ప్రార్థనలు చేయాలంటూ నైజీరియన్ బ్యాచ్ కు 12 లక్షల 45 వేల రూపాయలు పంపించింది. కానీ, కంటి వైద్యురాలి క్లినిక్ ఏర్పాటు పనులు మాత్రం సజావుగా సాగలేదు. దాంతో నైజీరియన్ ఫేక్ జ్యోతిష్యుల్ని ఆమె సంప్రదించగా మరింత డబ్బు కావాలంటూ బెదిరింపుతో మాట్లాడారు. చివరకు తాను మోసపోయానని గ్రహించిన కంటి వైద్యురాలు రాచకొండ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఢిల్లీ వెళ్లి నైజీరియన్ బ్యాచ్ లోని ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్స్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే ఉన్నత చదువులు చదివిన డాక్టర్ కూడా మోసపోవడం విస్మయానికి గురిచేసింది.