Chandrayaan 3 Success: చంద్రుడిపై ఉన్న హీలియంతో 3తో.. 10 వేల ఏళ్లకు సరిపడా కరెంట్‌ను ఉత్పత్తి?

ఇటీవల ఇస్రో సంస్థ చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేపట్టగా అధి విజయవంతంగా మారడంతో పాటు జాబిల్లిపై దిగిన విక్రమ్ ల్యాండర్ నుంచి బయటికి వచ్చిన ప్రజ్ఞ

  • Written By:
  • Publish Date - September 18, 2023 / 06:30 PM IST

ఇటీవల ఇస్రో సంస్థ చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేపట్టగా అధి విజయవంతంగా మారడంతో పాటు జాబిల్లిపై దిగిన విక్రమ్ ల్యాండర్ నుంచి బయటికి వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై తిరిగి మూలకాల జాడను కనిపెట్టింది. వాటికి సంబంధించిన వివరాలను కూడా ఎప్పటికప్పుడు ఇస్రోకు పంపిస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే తాజా అత్యంత ఖరీదైన మూలకాల్లో ఒకటైన హీలియం 3 చంద్రుడిపై సమృద్ధిగా ఉందని ఇప్పటివరకు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. అయితే జాబిల్లిపై దాదాపు 11 లక్షల టన్నుల హీలియం 3 నిల్వలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ హీలియం 3 ని గనక భూమిపైకి తీసుకువస్తే ఈ ప్రపంచం మొత్తానికి 10 వేల ఏళ్ల పాటు కరెంట్ అందించవచ్చని చెబుతున్నారు.

చంద్రుని దక్షిణ ధ్రువంపై మొదటగా దిగిన చంద్రయాన్ 3 లోని ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లిపై ఉన్న సల్ఫర్, ఆక్సిజన్, అల్యూమినియం, కాల్షియం, ఇనుము, క్రోమియం, టైటానియం వంటి మూలకాలు ఉన్నాయని గుర్తించింది. దీంతో పాటు హీలియం 3 అనే చాలా విలువైన మూలకం కూడా చంద్రుడిపై ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. భూమిపై ఉన్న అత్యంత ఖరీదైన వస్తువుల్లో హీలియం 3 ఒకటి అంటే ఆశ్చర్యపోక తప్పదు. ఒక కిలోగ్రామ్ హీలియం 3 ఖరీదు దాదాపు 40 వేల డాలర్ల నుంచి 50 లక్షల డాలర్లు ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.33.23 లక్షల నుంచి రూ.41.55 కోట్లు వరకు ఉంటుందని అంచనా. దీంతో ఇంత అత్యంత ఖరీదైన మూలకాన్ని భూమి మీదకు తీసుకువచ్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ఈ హీలియం 3 మూలకంతో స్వచ్ఛమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. దీంతో ఇదే భవిష్యత్‌లో విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరుగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ హీలియం 3 వల్ల ఎలాంటి రేడియేషన్‌ విడుదల కాదని దీని నుంచి ఎలాంటి వ్యర్థాలు ఉత్పత్తి కావని తెలిపారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇక చంద్రుడిపై ఉన్న ఒకటిన్నర గ్రాముల ఈ హీలియం 3 తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒక రోజు అవసరమయ్యే విద్యుత్‌ను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ లెక్కన కేవలం 50 గ్రాముల హీలియం 3 తో నెల రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు సరిపోయే కరెంటును అందించవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇక 30 టన్నుల హీలియం 3 తో నిరంతరాయంగా భారతదేశానికి ఏడాది పాటు కరెంట్‌ను అందించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ హీలియం 3 ని హైలియన్ అని కూడా అంటారు. ఇది హీలియం మూలకం యొక్క స్థిరమైన ఐసోటోప్ అని ఇందులో న్యూట్రాన్ల కంటే ఎక్కువ ప్రోటాన్లు ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రుడి మీదకు చైనా పంపించిన చేంజ్ అనే ఉపగ్రహం 2022 లో జాబిల్లి ఉపరితలం మీద ఉన్న మట్టిని భూమికి తీసుకువచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ మట్టిపై విస్తృత పరిశోధనలు చేసిన పరిశోధకులు సంచలన విషయాలు వెలికి తీశారు. హీలియం 3 చంద్రుని నేలలో ఉందని గుర్తించారు. ఒక గ్రాము హీలియం 3 మూలకం నుంచి 165 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక చంద్రునిపై సుమారు 11 లక్షల టన్నుల హీలియం 3 నిల్వలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. చంద్రుడి ఉపరితలంపై ఉన్న ఆ హీలియం 3 మూలకాన్ని భూమిపైకి తీసుకువస్తే అది ప్రపంచం మొత్తానికి వచ్చే 10 వేల సంవత్సరాలకు సరిపడా విద్యుత్‌ను అందిస్తుందని చెబుతున్నారు.