Site icon HashtagU Telugu

Bomb Cyclone : అమెరికాలో ‘బాంబ్ సైక్లోన్’ తో 34కు చేరిన మృతుల సంఖ్య

Bomb Cyclone America

Bomb Cyclone America

అమెరికాను (America) ‘బాంబ్ సైక్లోన్’ (Bomb Cyclone) వణికిస్తోంది. మంచు తుపాను కారణంగా మరణించిన వారి సంఖ్య 34కు పెరిగింది. ఇళ్ల చుట్టూ కొండలా పేరుకుపోతున్న మంచుతో జనం నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రాలేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో మంచు ధారాళంగా కురుస్తోంది. తుపాను వచ్చినప్పుడు దాని వాతావరణ పీడనం కనిష్ఠ స్థాయికి పడిపోతే ఆ తుపానును ‘బాంబ్ సైక్లోన్’ (Bomb Cyclone) గా వ్యవహరిస్తారు. గ్రేట్‌ లేక్స్ ప్రాంతంలో ఇది ఏర్పడినట్టు అధికారులు తెలిపారు.

చాలా ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తుండడంతో అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అంబులెన్సులు వచ్చేందుకు కనీసం మూడు గంటల సమయం పడుతోంది. ప్రభుత్వ గ్రంథాలయాలు, పోలీస్ స్టేషన్లను తాత్కాలిక శిబిరాలుగా వినియోగిస్తున్నారు. బఫె లో ప్రాంతంలో లక్ష మందికి పైగా విద్యుత్ లేక అల్లాడి పోతున్నారు. కెనడాలో 1,40,000 యుటిలిటీ వినియోగదారులకు విద్యుత్ లేదు.

ఒంటారియో, క్యుబెక్ వంటి ప్రాంతాల్లోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. క్రిస్మస్‌‌కు రెండు రోజుల ముందు దాదాపు 6 వేల విమానాలు రద్దు కాగా, అంతకుముందు గురువారం 2,700 విమానాలు రద్దయ్యాయి. అమెరికాలోని దాదాపు 60 శాతం మంది ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. క్రిస్మస్‌కు రెండు రోజుల ముందు అమెరికాలోని పలు ప్రాంతాల్లో మైనస్ 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలకు బయటకు రాలేక ఇళ్లలోనే మగ్గిపోయారు.

Also Read:  Rahul Gandhi : ఇది అంబానీ, అదానీ ప్రభుత్వం: రాహుల్ గాంధీ