తెలంగాణ బీజేపీలో అంతర్గ సమస్యలు నెలకొన్నాయా, నాయకుల మధ్య సఖ్యత లేదా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి బీజేపీ నాయకత్వంపై అలకబూనారు. కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొనడంపై ఆమె బహిరంగంగానే అభ్యంతరం తెలిపారు. తెలంగాణ ఏర్పాటును చివరి వరకు అడ్డుకున్న వ్యక్తితో కలిసి స్టేజ్ పంచుకోవడం తనకు ఇబ్బందిగా ఉందని విజయశాంతి మీడియాకు చెప్పారు. కిరణ్ రెడ్డి రావడంపై నిరసన వ్యక్తం చేస్తూ.. సభ నుంచి వెంటనే వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆమె బయట ఎవరికీ కనపడలేదు.
కొంత మంది సీనియర్ నాయకులు సంప్రదించడానికి ప్రయత్నించినా ఆమె టచ్‌లోకి రాలేదని తెలుస్తున్నది. కిరణ్ కుమార్ రెడ్డి పేరు చెప్పి తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నా.. విజయశాంతి ఆలోచనలు మరోలా ఉన్నాయనే చర్చ జరుగుతున్నది. కొంత కాలంగా బీజేపీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని విజయశాంతి బాధపడుతున్నారు. పాత నాయకులు పార్టీలో పాతుకొని పోగా.. కొత్తగా వచ్చిన నాయకులకు కూడా అధిష్టానం ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలో తనను పూర్తిగా పక్కన పెట్టారని విజయశాంతి భావిస్తున్నారు. కేవలం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాకతోనే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోలేదని.. తన అసంతృప్తిని బయటపెట్టడానికి సమయం కోసం వేచి చూసి.. వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయశాంతి ఏవిధంగా వ్యవహరించబోతుందో వేచి చూడాల్సిందే.